
ప్లాస్టిక్‌తో పర్యావరణానికి హాని
కర్నూలు(సెంట్రల్): ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఈ కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు నివారించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు అవసరమైతే కొత్తగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు బంగారు కుటుంబాల దత్తత ఎంత వరకు వచ్చిందని కలెక్టర్ అన్ని మండలాల ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. ఆప్షన్–3 కింద ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. శానిటేషన్ అంశంలో కోసిగి మండలం దొడ్డి గ్రామంలో ఐవీఆర్‌ఎస్ ద్వారా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని, అందుకు సంబంధించి యాక్షన్ టీం నివేదిక ఇవ్వడంతో పాటుసంబంఽధిత పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే చిప్పగిరి మండలం బెల్డోనలో కూడా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని, అక్కడకు వెళ్లి విచారణ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, సీపీఓ హిమ ప్రభాకర రాజు, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, హౌసింగ్ పీడీ చిరంజీవి, డ్వామా పీడీ వెంకటరమణయ్య, డీఈఓ శామ్యూల్‌పాల్ పాల్గొన్నారు.