
ప్రభుత్వ ఉద్యోగిపై దాడి హేయమైన చర్య
నంద్యాల(వ్యవసాయం): విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై టీడీపీ నాయకుల దాడి హేయమైన చర్య అని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ, ఆల్‌మేవా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక క్రాంతి రేఖా గ్రంథాలయంలో శుక్రవారం నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ అబ్దుల్లా రషాదీ, ఆల్ మేవా ఏపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్.మహమ్మద్ అబులైస్, ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో విధుల్లో ఉన్న డిప్యూటీ ఎంపీడీఓ తాహేర్ హుస్సేన్‌పై జరిగిన దాడిని నంద్యాల ముస్లిం జేఏసీ, ఆల్‌మేవా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 15వ తేదీన మార్గదర్శి బంగారు కుటుంబం సమావేశం నిర్వహిస్తుండగా చల్లా నాగరాజు అనే స్థానిక టీడీపీ నాయకుడు, సమావేశానికి తనను పిలువలేదని అనుచరులతో డిప్యూటీ ఎంపీడీఓ తాహేర్ హుస్సేన్‌పై పాల్పడడం అమానుషమన్నారు. చల్లా నాగరాజు గతంలో ఇద్దరు అధికారులపై ఇలాగే దౌర్జన్యం చేశాడని తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అబ్దుల్ సమ్మద్, ఇన్సాఫ్ బాబా ఫక్రుద్దీన్, ఎస్‌డీపీఐ మజీద్ ఖాన్, కోశాధికారి ఎస్పీ బాషా, కో కన్వీనర్ మస్తాన్, ఆల్‌మేవా మహమ్మద్ గౌస్, మిల్లీ కౌన్సిల్ అడ్వకేట్ అసదుల్లా, ఏఐఎంఐఎం సమీర్, నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు.