భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి | Sakshi
Sakshi News home page

భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి

Published Mon, Dec 4 2023 1:48 AM

గ్రామోత్సవ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి    - Sakshi

టీటీడీ ఈఓ ధర్మారెడ్డి

జూపాడుబంగ్లా: ప్రతి ఒక్కరూ హిందూధర్మ సంప్రదాయాలను పాటించటంతో పాటు భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి అన్నారు. ధర్మారెడ్డి స్వగ్రామమైన పారుమంచాలలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టోత్సవ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఆలయంలో ప్రతిష్టించనున్న స్వామివార్ల విగ్రహాలను ప్రత్యేక వాహనంలో ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ముందుగా గ్రామోత్సవ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఊరేగింపును ప్రారంభించారు. కార్యక్రమంలో ఆళ్ల నాగేశ్వరరెడ్డి, నర్రెద్దుల శ్రీనివాసరెడ్డి, తర్తూరు సర్పంచ్‌ పీఎం నాగిరెడ్డి, ఆలయ ఈఓ వెంకటరమణ, పోచ హేమశేఖర్‌రెడ్డి, పోచ లోకేశ్వరరెడ్డి, ఈదుల నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రేపు శ్రీశైలానికి

చంద్రబాబు నాయుడు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీశైలం రానున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 11 గంటలకు అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట హెలిపాడ్‌కు చేరుకుంటారు. సున్నిపెంట నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలాలయానికి చేరుకుంటారు. స్వామివార్లను దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న అనంతరం ఆయన తిరుగు ప్రయాణమవుతారు.

ఆటో బోల్తా.. విద్యార్థి మృతి

తుగ్గలి : ఆటో బోల్తా పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. తుగ్గలి ఎస్‌ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు..పెండేకల్లు ఇండ్ల కాశీం, సుశీలమ్మల కుమారుడు ప్రతాప్‌(17) పొలం నుంచి ఆటోలో టమాట బాక్సులు వేసుకుని శనివారం సాయంత్రం పత్తికొండ మార్కెట్‌కు వెళ్లాడు. టమాట అమ్ముకుని తిరిగి గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో ఎద్దులదొడ్డి సమీపంలో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రతాప్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడ్ని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రతాప్‌ డోన్‌లో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పాము కాటుతో

మహిళ మృతి

వెల్దుర్తి(కృష్ణగిరి): పాముకాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ కొలుకోలేక మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బోయినపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సి. బెళగల్‌ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన దేశపోగు ప్రేమరాజుకు కృష్ణగిరి మండలం ఎర్రగుడికి చెందిన సరోజ(32)తో 19ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండేళ్లుగా వీరు బతుకుదెరువు కోసం వెల్దుర్తి మండలం బోయినపల్లికి వచ్చారు. ఈ నెల 2న ఆర్ధరాత్రి సమయంలో సరోజను పాముకాటు వేసింది. ఆటోలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement