
ఖురాన్ పఠిస్తున్న దృశ్యం
సర్వపాప హరణం..
కర్నూలు(రాజ్‌విహార్): పవిత్ర రంజాన్ మాసంలో వెలువడింది దివ్య గ్రంథం ఖురాన్. అందుకే రంజాన్‌కు ఖురాన్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ‘రమ్‌దామ్’ అనే రబ్బీ పదం కాలక్రమేణా ‘రంజాన్’గా మారింది. పాప పరిహారాల కోసం ఈ నెల అనువైనది. ఈ మాసంలో ఖురాన్ పూర్తిగా వినడం మహమ్మద్ ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసొల్లం ఆచారం. హజరత్ జిబ్రయీల్ అలెసలాం ఏటా రంజాన్ మాసంలో మహా ప్రవక్త (స)కు సంపూర్ణ ఖురాన్ వినిపించేవారు. ఆయన ఆఖరి సంవత్సరంలో మహాప్రవక్తతో పాటు రెండు సార్లు ఖురాన్‌ను సంపూర్ణంగా పఠించారు. అందువల్ల ఈ మాసంలో అత్యధికంగా ఖురాన్ పఠించడానికి ప్రయత్నించాలి. ఖురాన్‌ను నెమ్మదిగా, అవగాహన చేసుకుంటూ చదవాలి. వజూ చేసిన తరువాత ఖురాన్‌ను పఠించడం ఉత్తమం. ప్రతిరోజూ ఖురాన్‌ను చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ గ్రంథంలోని 30 భాగాలను (పారా) కంఠస్థం చేసిన వారిని ఖురానే హాఫీజ్ అంటారు. వీరు ఏటా రంజాన్ మాసంలో రాత్రి చదివే ప్రత్యేక తరావీహ్ నమాజులో ఖురాన్‌ను చదివి వినిపిస్తారు. తరావీహ్ నమాజులో ఖురాన్‌ను పూర్తిగా వినేందుకు ప్రయత్నించాలి.
రోజూ ఒక భాగం:
పవిత్ర మాసం రంజాన్‌లో రాత్రి ఇషా నమాజు తరువాత చదివించే తరావీహ్ నమాజుకు ఎంతో విశిష్టత ఉంది. మిగిలిన 11 నెలల్లో ఇది ఉండదు. చదవాలనీ లేదు. మహమ్మద్ ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసొల్లం తప్పని సరిగా పాటించినందుకు దీనిని సున్నత్‌గా పరిగణించారు. ఈ నమాజులో ప్రతి రోజూ ఒక భాగం చొప్పున నెలలో పూర్తి ఖురాన్ చదివి వినిపిస్తారు. చదవడం రాని వారు తరవీహ్ నమాజు చేస్తే కనీసం పూర్తి ఖురాన్ శ్రద్ధగా వినవచ్చు.
ఖురాన్ గణాంకాలు
పవిత్ర ఖురాన్‌లో 30పారాలు (భాగాలు) ఉన్నాయి. 32,12,670 ముకమ్మల్ ఉర్‌ఫే (అక్షరాలు), 6,666 ఆయతే (వాక్యాలు), 540 రుకులు (ఫుల్‌స్టాప్‌లు), 114 సూరాలు (వచనాలు) ఉన్నాయి. వీటితో పాటు 14 సిజ్ధాహ్ (సాష్టాంగా ప్రణామాలు) ఉన్నాయి. ఖురాన్‌లో పదాలను ఆయత్ అంటారు. రంజాన్ మాసంలో ఒకసారి చదివితే సాధారణ రోజుల్లో 70 సార్లు చదివిన పుణ్యం లభిస్తుంది. ఇది 1,400 సంవత్సరాల కిత్రం అవిర్భవించింది. హజరత్ ఇబ్రహీమ్‌కు రంజాన్ మాసంలోనే మొదటి లేదా మూడో తేదీన పవిత్ర ఖురాన్ గ్రంథం ప్రసాదితమైంది. హజరత్ దావూద్‌కు ఈ నెలలో 12 లేదా 18వ తేదీల్లో జబూర్ గ్రంథం సిద్ధించింది.
30 భాగాలు.. ఒక్కో భాగానికి
ఒక్కో అర్థం
ప్రతి ముస్లిం పఠించడం తప్పనిసరి
చదువు రాని వారు
కనీసం శ్రద్ధగా వినాలి
దివ్య గ్రంథం
దివ్య గ్రంథం ఖురాన్ పవిత్ర రంజాన్ మాసంలో వెలువడింది. ఈ గ్రంథాన్ని చదివేందుకు వయస్సుతో పని లేదు. కేవలం చదవడం కాదు.. అర్థం కూడా తెలిసి ఉంటేనే అందులోని పదాల మహత్యం తెలుస్తుంది.
– మౌలానా అబ్దుల్ ఖావి జవీద్, కర్నూలు.
మహా పుణ్యం
ఖురాన్ పఠించడం ద్వారా సకల పాపాలు హరిస్తాయి. ముఖ్యంగా రంజాన్ మాసంలో దీని పఠనం తప్పని సరి. ఒక్క సారి చదివితే 70సార్లు చదివిన పుణ్యం అల్లాహ్ మనకు ప్రసాదిస్తారు. ప్రతి ఒక్కరూ దీనిని నేర్చుకోవడం మంచిది. 30 భాగాల్లో ఎన్నో అర్థాలు, పరమార్థాలున్నాయి. ఆకాలంలో ఇందులోని కలిమా, ఆయత్, సూరాలు చదివి రోగాలను నయం చేసేవారు.
– హాఫిజ్ గఫూర్, ఖురానే హాఫీజ్, గోనెగండ్ల.


