
కేసీ ఆయకట్టు కింద రబీలో సాగు చేసిన జొన్న
● ఈ ఏడాది 36.2 టీఎంసీల
నీటి వినియోగం
● రబీలో 1.37 లక్షల ఎకరాలకు
అందిన సాగు నీరు
● సమర్థవంతంగా నీటి నిర్వహణ
కర్నూలు సిటీ: కేసీ కెనాల్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా కోటా నీరు అందింది. దీంతో రబీలో రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. తుంగభద్ర జలాశయం నుంచి కేసీ కెనాల్‌కు మొత్తం 39 టీఎంసీట నీటి వాటా ఉంది. ఇందులో నది ప్రవాహం ద్వారా 29 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. అలాగే డ్యాంలో నిల్వ ఉండే నీటి నుంచి 10 టీఎంసీలు దామాషా ప్రకారం కేటాయింపులు ఉన్నాయి. తుంగభద్ర డ్యాంలో పూడిక చేరిందనే సాకుతో ఏటా నీటి వాటాకు గండికొట్టేవారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 171 టీఎంసీలకు అంచనా వేశారు. అయితే అంచనాల మించి టీబీ డ్యాంలోకి 188 టీఎంసీల నీరు చేరాయి. దీంతో కేసీ కెనాల్‌కు మొదటగా కేటాయించిన 6.45 టీఎంసీల వాటాను 8.868 టీఎంసీలకు పెంచారు. సుంకేసుల నుంచి కేసీకెనాల్‌కు 31.3 టీఎంసీలు, మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి 0.9టీంసీలు, ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి 4.07టీఎంసీలు వాడుకున్నారు. మొత్తంగా కేసీ కెనాల్‌కు 36.2 టీఎంసీల నీటిని వాడుకున్నారు.
మొట్టమొదటి సారి..
గతేడాది జూలై 15 నుంచి కేసీకి నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. టీబీ డ్యాంలోని వాటా నీటి విడుదల ఈ నెల 27వ తేదీతో ముగిసింది. అయినా కాలువలో నీటి ప్రవహం కొనసాగుతూనే ఉంది. సుంకేసుల జలాశయం నుంచి 602 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు కేసీ కెనాల్‌పై ఆధారపడి ఉన్నాయి. ఈ కాలువ చరిత్రలోనే మొట్టమొదటిసారి రబీ సీజన్‌లో ఆయకట్టు అత్యధికంగా సాగైంది. రబీలో 90 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే అంతకు మించి మరో 47 వేల ఎకరాలకు అదనంగా సాగయ్యాయి.
మెరుగుపడిన నీటి సరఫరా
టీడీపీ హయాంలో, అంత కంటే ముందున్న ఉమ్మడి రాష్ట్రంలోని చివరి ప్రభుత్వ హయాంలో కేసీ కెనాల్ కింద మొదటి పంటలకే సాగు నీరు సక్రమంగా అందేది కాదు. చివరికి పంటలను పశువుల మేపుకు వదిలేసిన రోజులు ఉన్నాయి. అయితే 2019 తరువాత నీటి కష్టాలు తొలగాయి. గతంలో ఏ తూము దగ్గర కూడా నీటి నియంత్రణ సక్రమంగా ఉండేది కాదు. దీంతో అధికంగా నీరు వృథా అయ్యేది. సాగైన పంటలకు సక్రమంగా నీరు అందేది కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సరఫరా మెరుగుపడింది. జలవనరుల శాఖ ఇంజినీర్లు రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి ఆయకట్టుకు నీరు అందించగలుగుతున్నారు.
నీటి నిర్వహణ చక్కగా చేశారు
సాగునీటి సలహా మండలి సమావేశంలో చేసిన తీర్మానం మేరకు కేసీ కాల్వ కింద రబీ సీజన్‌లో 90 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పూర్తి స్థాయిలో అందించాం. సాగైన పంటలు కోతకు వచ్చాయి. కేసీ కెనాల్ ఈఈ, డీఈఈ, జేఈఈ, ఏఈఈలు కాల్వపై పర్యటనలు చేశారు. నీటి నిర్వహణ చక్కగా చేశారు. తుంగభద్ర డ్యాంలోని కేసీ వాటా కోటా పూర్తి అయ్యింది. ఈ ఏడాది 8.868 టీఎంసీలు నీటి కేటాయింపులు చేశారు. నీటినంతా వినియోగించుకున్నాం.
– రెడ్డి శేఖర్ రెడ్డి, జల వనరుల శాఖ
పర్యవేక్షక ఇంజినీర్