
● వైఎస్సార్‌సీపీ బలాన్ని మించి
అదనంగా 29 ఓట్లు
● వీరిలో టీడీపీతో పాటు బీజేపీ,
వామపక్షాలతో పాటు ఇతరులు
● ఓట్లు చీల్చాలనుకున్న తమ్ముళ్లకు
చెంపపెట్టు ఫలితాలు
● ధ్రువీకరణ పత్రాలను అందజేసిన
ఆర్‌ఓ రామసుందర్‌రెడ్డి
● కౌంటింగ్ హాలు వద్ద
వైఎస్సార్‌సీపీ నేతల కోలాహలం
సాక్షి ప్రతినిధి కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. స్పష్టమైన బలం ఉండటంతో పోటీ నామమాత్రం అని భావించినట్లే ఫలితం ఏకపక్షంగా వచ్చింది. ఎన్నికల్లో డాక్టర్ బోయ మధుసూదన్‌కు 988 ఓట్లతో తిరుగులేని గెలుపును సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామసుందర్‌రెడ్డి ధ్రువీకరణ పత్రం అందజేశారు. మధుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, కర్నూలు మేయర్ బి.వై.రామయ్య ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణుల సంబరం అంబరాన్నంటింది. ఈలలు, కేకలతో బోయ మధుసూదన్‌కు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ‘జైజగన్.. జిందాబాద్ వైఎస్సార్‌సీపీ’ నినాదాలతో సిల్వల్‌జూబ్లీ ప్రాంగణం హోరెత్తింది.
ప్రశాంతంగా కౌంటింగ్
కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ కళాశాలలో గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. రిటర్నింగ్ అధికారి రామసుందర్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు ఎంఎం నాయక్ ఆధ్వర్యంలో ఉదయం 8గంటలకే లెక్కింపు ప్రారంభమైంది. రెండు టేబుళ్లలో ఒకే రౌండ్‌గా ఓట్లను లెక్కించారు. 25 ఓట్ల చొప్పున బ్యాలెట్ పత్రాలను విభజించి లెక్కింపు ప్రారంభించారు. 9.30 గంటలకే లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత మరోసారి బ్యాలెట్ పత్రాలు ఇతర అంశాలను పరిశీలించి అధికారికంగా మధు ఎన్నికను ప్రకటించారు. కలెక్టర్ కోటేశ్వరరావు లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను పర్యవేక్షించారు.
వైఎస్సార్‌సీపీలో జోష్
‘స్థానిక సంస్థల’ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ఊహించిందే అయినా పోలైన ఓట్లు మాత్రం రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఉన్న బలం కంటే ఎక్కువగా వైఎస్సార్‌సీపీకి పోలవడం, టీడీపీకి ఉన్న ఓట్ల కంటే తక్కువ పోలవడంతో గమనార్హం. వైఎస్సార్‌సీపీకి 1,005 ఓట్లు ఉండగా.. చెల్లని ఓట్లు 46( మధు గుర్తు పక్కలో ప్రాధాన్యత ఓటు 1గా వేయకుండా టిక్ మార్క్ వేశారు). ఈ లెక్కన 959 ఓట్లు పోలవ్వాల్సి ఉండగా.. వైఎస్సార్‌సీపీకి 988 ఓట్లు పోలవడం విశేషం. అంటే 29 ఓట్లు అధికంగా పోలయ్యాయి. ఈ ఓట్లను పరిశీలిస్తే టీడీపీ, బీజేపీ, వామపక్షాలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీకే మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది.
సమష్టి మంత్రం సక్సెస్
కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర కీలక ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేశారని ఈ ఎన్నిక స్పష్టం చేస్తోంది. టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీ ఓటర్లను ప్రలోభపెట్టాలని చూశారు. గెలవలేమని తెలిసినా, వైఎస్సార్‌సీపీకి ఉన్న ఓట్లలో కొన్నింటినైనా తగ్గించగలిగితే ఆ పార్టీకి ఉన్న ఓట్లు కూడా పోలవ్వలేదని, పార్టీ పట్ల కేడర్ నమ్మకంగా లేదని, బలం తగ్గిందని ప్రచారం చేసుకోవచ్చని భావించారు. అయితే వైఎస్సార్‌సీపీ నే తలు సమష్టిగా పనిచేసి ఒక్క ఓటు పక్కకు పోనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇదే క్రమంలో ఇతర పార్టీ ఓట్లు కూడా వైఎస్సార్‌సీపీకి పోలవడంతో తమ బలం మరింత పెరిగిందని ఈ ఎన్నిక ద్వారా చెప్పినట్లయింది.
స్థానిక సంస్థల మొత్తం ఓట్లు: 1178 పోలైన ఓట్లు: 1136 చెల్లని ఓట్లు: 53వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌కు పోలైన ఓట్లు: 988 స్వతంత్ర అభ్యర్థి ఎన్.మోహన్‌రెడ్డికి పోలైన ఓట్లు: 85 స్వతంత్ర అభ్యర్థి భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డికి పోలైన ఓట్లు: 10
టీడీపీకి చెంపపెట్టు!
టీడీపీకి 134 ఓట్లు ఉండగా.. 19మంది ఓటు హక్కు వినియోగించుకోలేదని తెలుస్తోంది. మిగిలిన 115 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 7 చెల్లని ఓట్లు. తక్కిన 108 ఓట్లలో మోహన్‌రెడ్డికి 85, వెంకట వేణుగోపాల్‌రెడ్డికి 10 కలిపి 95 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే తక్కిన 13 మంది టీడీపీ ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీకి జైకొట్టడం విశేషం. మధుకు అదనంగా పోలైన 29 ఓట్లలో 13 తీసేస్తే తక్కిన 16 ఓట్లు బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేనతో ఇతరుల నుంచి పోలైనట్లు స్పష్టమవుతోంది. దీంతో ఈ ఫలితాలు టీడీపీకి చెంపపెట్టుగా మారాయి. నిజానికి ఈ ఎన్నికల్లో ఏమాత్రం బలం లేకపోయినా తమ పార్టీ సర్పంచ్‌లతో స్వతంత్రులుగా బరిలో నిలిపారు. చివరకు తమ పార్టీ ప్రజాప్రతినిధులతో కూడా ఓట్లు వేయించుకోలేకపోయారు. పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌సీపీకి ఆకర్షితులవుతున్నారనేందుకు ఈ ఎన్నిక నిదర్శనం.
