ఫిర్యాదుల పరిష్కారమే మా లక్ష్యం
కోనేరుసెంటర్: మీకోసంలో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించటమే తమ కర్తవ్యమని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని ఫిర్యాదులను అక్కడికక్కడే ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్య ఎలాంటిదైనా చట్టపరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. న్యాయం కోసం ధైర్యంగా పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. బాధితులకు స్టేషన్‌లలో న్యాయం జరగని పక్షంలో మీకోసం కార్యక్రమంలో నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మీకోసం కార్యక్రమంలో 35 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు పాల్గొన్నారు.
ప్రధానమైన అర్జీలు
● అవనిగడ్డ నుంచి సుందర్ అనే వ్యక్తి తాను కుటుంబ అవసరాల నిమిత్తం తన దగ్గర బంధువు వద్ద కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నానని, వడ్డీ కడుతున్నా, బలవంతంగా చెక్కులపై సంతకాలు చేయించుకున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
● పెనమలూరు నుంచి సీత అనే వివాహిత తనకు వివాహం జరిగి మూడేళ్లయిందని, పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం కోసం భర్త అత్తింటివారు వేధిస్తున్నారని, చిత్రహింసలకు గురిచేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని వాపోయింది.
● బంటుమిల్లి నుంచి సాకేత్ అనే యువకుడు తాను పీజీ పూర్తి చేసి ఖాళీగా ఉండగా తన స్నేహితుడు రూ.2 లక్షలు కడితే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సంవత్సరం క్రితం డబ్బు కట్టించుకున్నాడని, ఉద్యోగం విషయం అడిగితే ఎటువంటి సమాధానం చెప్పకపోగా బెదిరిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నాడు.
మీకోసంలో జిల్లా ఎస్పీ
విద్యాసాగర్‌నాయుడు


