ప్రమాదకర చర్యలకు పాల్పడినందుకే దండన
హనుమాన్‌జంక్షన్ రూరల్: ప్రాణాపాయ చర్యలకు పాల్పడినందుకే విద్యార్థులను దండించారని, అయితే విద్యార్థులను తీవ్రంగా కొట్టిన ఉపాధ్యాయుడిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డి.యదునందన తెలిపారు. బాపులపాడు మండలం వేలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో రాత్రివేళ గోడదూకి బయటకు వెళ్లిన విద్యార్థులను హౌస్ టీచర్ విచక్షణారహితంగా కొట్టిన ఘటనపై ప్రిన్సిపాల్ యదునందన సోమవారం వివరణ ఇచ్చారు. గత నెల 23వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో 8వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులు హాస్టల్ రూమ్ నుంచి బయటకు వచ్చి, పాఠశాల వెనుక వైపు ప్రహారీగోడ దూకి బిర్యానీ కొనుగోలు చేసేందుకు వెళ్లినట్లుగా తమకు తెలిసిందన్నారు. పాఠశాలకు ఆనుకుని ఉన్న పామాయిల్ తోటల్లో అర్ధరాత్రి సమయంలో, విషపూరిత సర్పాలు తిరిగే ప్రాంతంలో వెళ్లటం ఎంతో ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక రాత్రివేళ విద్యార్థులు రహదారుల వెంబడి తిరగటం, హోటళ్ల నుంచి తెచ్చిన ఆహారం తీసుకోవటం కూడా ప్రమాదకరమేనన్నారు. ఈ ఘటనలో ఆ ఐదుగురితో పాటుగా ఆ బిర్యానీ పార్శిల్స్‌ను తిన్న 21 మంది విద్యార్థులను సంబంధిత హౌస్ టీచర్ మందలించారని తెలిపారు. ఆ విద్యార్థులకు ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే బాధ్యత వహించాల్సింది ఆయనేనని, అందుకే ఆవేశంలో హౌస్ టీచర్ వారిని తీవ్రంగా దండించారని చెప్పారు. 21 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులతో ఇళ్లకు పంపించామని తెలిపారు. విచక్షణారహితంగా కొట్టిన హౌస్ టీచర్‌పై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని చెప్పారు. నవోదయ విద్యాలయ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాపులపాడు ఎంఈవో–2 కొమ్మా విజయ్ సోమవారం పాఠశాలలో విచారణ నిర్వహించారు.
వేలేరు జవహర్ నవోదయ ఘటనపై
ప్రిన్సిపాల్ వివరణ
21 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్
విచక్షణారహితంగా కొట్టిన
హౌస్ టీచర్‌పై చర్యలకు సిఫార్సు


