అమృతలింగేశ్వరుని సన్నిధిలో తనికెళ్ల భరణి
ముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామంలోని కోటి లింగ హరిహర మహా క్షేత్రంలోని కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి వారిని సోమవారం సినీ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. సాధారణ భక్తుడిలా ఆలయంలోకి వచ్చి పూజలు చేశారు. విషయం తెలుసుకున్న అర్చకులు, అధికారులు మరలా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. కోటిలింగాల క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని భరణి అన్నారు. ఆలయ ఈవో హరిదుర్గా నాగేశ్వరరావు, అర్చకులు మణికంఠ, హర్ష పూజల అనంతరం ప్రసాదాలు అందజేశారు.
టోల్‌గేట్ కాంట్రాక్టర్‌కు రూ.50 వేలు జరిమానా
బకాయి చెల్లింపునకు 72 గంటలు గడువు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి టోల్‌గేట్ కాంట్రాక్టర్ వీఎల్‌డీ ఏజెన్సీకి దుర్గగుడి అధికారులు రూ.50 వేలు జరిమానా విధించారు. దుర్గగుడి దిగువన అక్రమంగా పార్కింగ్ డబ్బులు వసూలు, భక్తుల బెదిరింపులపై దేవస్థానానికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్ పలుమార్లు కాంట్రాక్టర్‌కు నోటీసులు సైతం జారీ చేశారు. అయినా కాంట్రాక్టర్ తీరు మారకపోవడంతో సోమవారం రూ.50 వేలు జరిమానా విధించారు. జరిమానాను 3 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానానికి బకాయి ఉన్న రూ.1,11,98,199ను 72 గంటల్లో చెల్లించాలని ఆదేశించారు. 72 గంటల్లో బకాయి మొత్తం చెల్లించని పక్షంలో టెండర్ షరతుల మేరకు దేవస్థానం రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఒకే నెలలో 10.70 కిలోమీటర్ల మేర స్లీపర్‌లను పునరుద్ధరించి రికా ర్డు నెలకొల్పినట్లు డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే కారిడార్‌లలో ఒకటైన విజయవాడ–విశాఖపట్నం ట్రంక్ రూట్‌లో ఎటువంటి రైళ్ల రద్దుగాని, దారి మళ్లింపు లేకుండా ఈ పనులు చేపట్టినట్లు వివరించారు. ఇంజినీరింగ్, ఆపరేటింగ్, ఎస్‌అండ్‌టీ, టీడీఆర్ విభాగాల సమష్టి కృషితో విజయవాడ డివిజన్ ఈ అరుదైన ఘనత సాధించినట్లు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో 28 ట్రాఫిక్ బ్లాక్‌లను ఏర్పాటు చేశామని, అందులో రెండుసార్లు ఒకే రోజులో రెండు బ్లాక్‌లను ఏర్పాటు చేయడం దక్షిణ మధ్య రైల్వేలోనే మొదటిసారి కావటం విశేషమన్నారు. దీని కోసం ప్రత్యేకమైన టీఆర్‌టీ యంత్రాన్ని ఉపయోగించి 352 కేజీల బరువుతో ఉండే స్లీపర్‌లను తొలగించినట్లు వెల్లడించారు.


