
విమానాశ్రయంలో ఘనంగా యాత్రి సేవ దివస్
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో బుధవారం యాత్రి సేవ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. తొలుత విమానాశ్రయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వేర్వేరుగా మొక్కలు నాటారు. అనంతరం విమానాశ్రయ టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులు, భద్రత దళాలను ఆయన అభినందించారు. అనంతరం జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ట్యాక్సి, క్యాబ్స్ డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో ప్రయాణికులకు సాధరణ హెల్త్ చెకప్‌లు నిర్వహించారు. వంద మంది జెడ్పీ హైస్కూళ్ల విద్యార్థులకు విమానాశ్రయ సందర్శనకు అవకాశం కల్పించారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, విమానయాన రంగంలో ఉద్యోగ అవకాశాలు గురించి వివరించారు. యాత్రి సేవ దివస్‌ను పురస్కరించుకుని విమానాశ్రయానికి విచ్చేసిన ప్రయాణికులకు ప్రత్యేకంగా తిలకం దిద్ది స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులకు, బాల ప్రయాణికులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక, జానపద నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, పలువురు విమానాశ్రయ ఉద్యోగులు పాల్గొన్నారు.