ఘంటసాల: నాన్ అక్వాజోన్‌లో కొందరు వ్యక్తులు రొయ్యల చెరువుల సాగు చేస్తుండటంతో ఘంటసాల నుంచి చిలకలపూడికి వెళ్లే రహదారిలో వేలాది ఎకరాలు చౌడు భూములుగా మారాయి. రొయ్యల చెరువుల కారణంగా పంటలు పండటం లేదని సమీప పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దకాలంగా ఈ అంశంపై అధికారులకు మొర పెట్టుకుంటునప్పటికీ పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గంజి కాలువ పొడవునా..
ఘంటసాల నుంచి చిలకలపూడికి వెల్లే రహదారిలో గంజికాలువ (భీమనది డ్రైన్) పొడవునా కొంతమంది రొయ్యల చెరువులు సాగుచేస్తున్నారు. 2014లో ఈ ప్రాంతంలో 50ఎకరాల్లో కొంతమంది చేపల చెరువులు తవ్వేందుకు ప్రయత్నించగా ఈ ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాన్ ఆక్వాజోన్‌లో చెరువులు తవ్వితే తమ పొలాల్లో పంటలు పండవంటూ అప్పట్లో స్పందనలో అధికారులకు అర్జీలు అందజేశారు. ఈక్రమంలో సదరు వ్యక్తులు చెరువుల్లో చేపలు మాత్రమే సాగు చేస్తామని, పొలాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు, రైతులను నమ్మబలికారు. అయితే చేపల సాగు ఆశాజనకంగా లేకపోవడంతో యజమానులు వాటిని రొయ్యల చెరువులుగా మార్చారు. రొయ్యల సాగు కోసం నీటిలో భారీస్థాయిలో ఉప్పు బస్తాలు వేస్తుండటంతోపాటు రసాయనాలను కూడా కలుపుతుండటంతో పరిసర ప్రాంతాల్లోని పంటపొలాల్లో ఉప్పు చేరి ఆ భూముల చౌడుగా మారుతున్నాయి. దీంతో సుమారు 2వేల ఎకరాల్లోని పంటపొలాలు దెబ్బతింటున్నాయని బాధిత రైతులు వాపోతున్నారు.
రెండో పంటకు ఆస్కారం లేదు..
గతంలో ఈప్రాంతంలోని పొలాలు ఏటా రెండు పంటలు పండేవి. రొయ్యల చెరువుల సాగు కారణంగా చౌడుభూములుగా మారి రెండో పంట ఆస్కారం లేకుండా పోయింది. ఉప్పునీటి ఉరకతో దిగుబడులు కూడా తగ్గిపోయాయి. దీంతో పొలాలను కౌలుకు కూడా తీసుకోవడం లేదు.
కలుషితమవుతున్న నీరు..
రొయ్యల చెరువుల నుంచి ఉప్పునీరు, వ్యర్థాలను వాటి యజమానులు గంజికాలువ(భీమనది డ్రెయిన్)లోకి వదులుతుండటంతో నీరు కలుషితమై ఉప్పగా మారిపోతోంది. సమీపంలోని బోళ్లపాడులో భూగర్భజలాలు కూడా ఉప్పలుగా మారడంతో గ్రామస్తులు ఇబ్బందిపడుతున్నారు. గత నెల 30వ తేదీన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేశామని, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పందించి రొయ్యల చెరువుల సాగును నిలుపుదల చేయించి తమను ఆదుకోవాలని ఈప్రాంత రైతులు, ప్రజలు కోరుతున్నారు.
నెలాఖరులోగా సమస్యను పరిష్కరిస్తా..
నాగరాజు, మత్స్యశాఖ జేడీ
ఘంటసాల రైతులు ఇచ్చిన అర్జీపై ఇటీవల గ్రామంలోని రైతులతో మాట్లాడాం. రొయ్యల చెరువుల యజమానులతో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.. నెలాఖరులోపు సమస్యను పరిష్కరిస్తాను.
చౌడుగా మారుతున్న పొలాలు 2వేల ఎకరాలకు ముప్పు కలుషితమవుతున్న తాగు,సాగునీరు పట్టించుకోని అధికారులు
పొలాలను కబళిస్తున్న రొయ్యల చెరువులు