
స్పెషల్ బ్రాంచ్ సీఐ సస్పెన్షన్
కోనేరుసెంటర్: కృష్ణాజిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ వాసంశెట్టి శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్‌కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాసరావు ఏడాది కాలంగా జిల్లా స్పెషల్‌బ్రాంచ్ సీఐగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం కారణంగా ఐజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రేమికుడి మోసానికి
యువతి బలి
ఉయ్యూరురూరల్: ప్రేమికుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరు మండలంలోని చిన్న ఓగిరాల్లో చోటుచేసుకుంది..పోలీసుల కథనం మేరకు మండలంలోని చిన్న ఓగిరాల గ్రామానికి చెందిన సుధా అనే యువతి, కంకిపాడు మండలం నెపల్లి గ్రామానికి చెందిన డొక్కు జితేంద్ర ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కులాలు వేరు అనే నెపంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో జితేంద్ర, సుధాను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆమె మోతాదుకు మించి టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆ యువతి శుక్రవారం మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉయ్యూరు రూరల్ ఎస్సై సురేష్‌కుమార్ తెలిపారు.
కుక్కల దాడితో బాలుడికి తీవ్రగాయాలు
శివాపురం(పెనుగంచిప్రోలు): వీధి కుక్కలు దాడిచేయడంతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొంక కేతన్‌సాయి అనే 17నెలల బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేశాయి. ఈఘటనలో బాలుడి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని పెనుగంచిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతనం మెరుగైన చికిత్స కోసం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదేవిధంగా రెండు రోజుల కిందట కూడా గ్రామానికి చెందిన దైదా వీరయ్య, కురువెళ్ల దాసు అనే ఇద్దరిని కూడా కుక్కలు గాయపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
గుడివాడరూరల్: ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలకు గురైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గుడివాడ ఆటోనగర్‌లోని ఓ ఇంజినీరింగ్ వర్క్స్‌లో గొర్రె వెంకటేశ్వరరావు(50), గల్లా రాంబాబు(42) వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ఘాతానికి గురై వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీరిని స్థానికులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి వెంకటేశ్వరరావు మృతి చెందారని తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాంబాబును విజయవాడకు తరలించారు. మృతుడు వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.