
పబ్లిసిటీ తప్ప పర్యవేక్షణేది?
నగరంలో పోలీసులు డ్రోన్‌లు, సీసీ కెమెరాలు పెట్టామని నిఘా పెట్టామని హడావుడి తప్ప, క్షేత్ర స్థాయిలో బేసిక్ పోలీసింగ్‌ను గాలికి వదిలివేశారు. నగరంలోని 28 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, పాత నేరస్తులపైన పోలీసులకు నియంత్రణ లేకుండా పోతోంది. జైళ్ల నుంచి విడుదల అవుతున్న పాత నేరస్తులపై నిఘా కొరవడింది. దీంతో దొంగతనాలు, చేసిన వాళ్లే మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. లాడ్జిల్లో తనిఖీలు జరగటం లేదు. రక్షక్, బ్లూకోట్స్ పనితీరు నామమాత్రంగానే ఉంది. ఈగల్ టీంలు కనిపించటం లేదు. నేరాల సమీక్ష ఉండటం లేదు. నగరమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా, ఈ కెమెరాలు సంబంధింత పోలీస్‌స్టేషన్లకు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం పూర్తి స్థాయిలో జరగటం లేదు, దీంతో సీసీ ఫుటేజీ అందుబాటులో ఉండటం లేదు. మొత్తం మీద నేరాల సంఖ్యను తక్కువ చేసి చూపడంలో భాగంగా పలు స్టేషన్లలో కేసులు సైతం నమోదు చేయడం లేదని తెలుస్తోంది.