
దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీశ దంపతులను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు వాయిదా
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఆయా సంఘాల సభ్యులు హాజరుకాకపోవటంతో వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో కె. కన్నమనాయుడు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఆయా ప్రభుత్వశాఖల అధికారులు హాజరైనప్పటికీ, చైర్‌పర్సన్, జెడ్పీటీసీ సభ్యులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో సమావేశాలు నిర్వహణ సమయం ప్రకటించిన ప్రకారం వేచి చూసి, ఒక్కొక్క సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం సీఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ స్థాయీ సంఘ సమావేశాలకు సభ్యులు ఎవరూ హాజరు కాలేదని, సమావేశాలు నిర్వహించే తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డేను శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శుక్రవారం ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తామన్నారు. ఈ గ్రీవెన్స్ డేలో అధికారులు 29 అర్జీలు స్వీకరించగా, వాటిలో 9 రెవెన్యూ, ఆరు పోలీస్, మూడు డీఆర్డీఏ, ఇతర శాఖలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ వచ్చినట్లు డీఆర్వో తెలిపారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో రానున్న రెండు రోజుల పాటు కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని, ప్రజలు అప్రమత్తతతో జాగ్రత్తగా ఉండాలని, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామన్నారు. వర్షాలు, గాలుల సమయంలో భారీ హోర్డింగులు, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర ఉండకూడదన్నారు. పిడుగులు కూడా పడే అవకాశమున్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణ, పశునష్టం, పంట నష్టం జరగకుండా పటిష్టమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
28న ప్రత్యేక పాస్‌పోర్టు శిబిరం
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రం కూచిపూడిని రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ సంపద ప్రాంతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో ప్రత్యేక పాస్‌పోర్ట్ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉయ్యూరు డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి ఎస్. రాజేష్ తెలిపారు. ఆయన ఎంపీడీవో డి. సుహాసినితో కలిసి శుక్రవారం కూచిపూడి గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ పాస్ పోర్ట్ శిబిరాన్ని విజయవంతం చేయడానికి సంయుక్తంగా కృషి చేయాలన్నారు. కళాపీఠం ఉప ప్రధాన చార్యులు చింతా రవి బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి కేవీ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్