
సారె తెచ్చి.. మనసారా కొలిచి..
భక్త బృందాలతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు బృందాలుగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. ఘాట్‌రోడ్డు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని దర్శించుకుని సారెను సమర్పించారు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. సారె సమర్పించే భక్తులకు రూ. 100, రూ. 300 క్యూలైన్‌లో ఉచితంగా అనుమతించారు. సర్వ దర్శనం క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి.
భక్తుల ఇబ్బందులు..
ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు రాజగోపురం, ఘాట్‌రోడ్డు, చిన్న గాలి గోపురం ప్రాంతాల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆలయ ప్రాంగణంలో కొన్ని చోట్ల కాయర్ మ్యాట్ వేసినా.. మిగిలిన చోట్ల భక్తులు కాళ్ల కాలుతుండటంతో పరుగులు పెట్టారు.

సారె తెచ్చి.. మనసారా కొలిచి..