
కార్తికేయుని సన్నిధిలో పండుగ వాతావరణం
మోపిదేవి: పండుగ వాతావరణంలో సుబ్బారాయుడి పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో రెండో రోజు శుక్రవారం ఆషాఢ కృత్తిక పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్‌కుమార్ శర్మ, వేదపండితులు, రుత్వికులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు గోపూజ, సుప్రభాతసేవ, నిత్యార్చన, నవకుంభారోపణం, ఏకాదశ ద్రవ్యాభిషేకం, అన్నాభిషేకం, సుబ్రహ్మణ్య మూల మంత్ర అనుష్టానాలు, హవనం, మూలమూర్తులకు ఉత్సవ మూర్తులకు పట్టు పవిత్రాల సమర్పణ, మహానివేదన, నీరాజన మంత్రపుష్పాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రదోష కాలార్చన, నిత్యహోమం, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వినియోగం భక్తిశ్రద్ధలతో జరిపించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు.