
అక్రమ కేసులకు భయపడం
సాక్షి ప్రతినిది, విజయవాడ: కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పామర్రులో ఈ నెల ఎనిమిదో తేదీన ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించేందుకు పోలీసుల సాయంతో కూటమి నేతలు ప్రయత్నించారని విమర్శించారు. ఆ రోజు ఉదయమే పామర్రులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను బలవంతంగా పోలీసులు తొలగించి భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని పేర్కొన్నారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు నాలుగు రోజుల తరువాత, ఆ సమావేశానికి వచ్చిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ప్రసంగాన్ని వక్రీకరించి తప్పుడు కేసు బనాయించారని వివరించారు. పేర్ని నానిని తాను ప్రేరేపించి మాట్లాడించినట్లు తనతోపాటు, నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు, ముఖ్యనేతలు, కల్యాణ మండపం యజమాని సహా ఆరుగురిపై టీడీపీ నేతలు తప్పుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. కేసులను న్యాయ స్థానాల్లో తేల్చుకుంటామని కైలే అనిల్‌కుమార్ స్పష్టంచేశారు.
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్