● గోలేటి ఓసీపీ ప్రారంభం కోసం తీవ్రంగా ప్రయత్నాలు ● కొనసాగుతున్న భూసేకరణ, పునరావాస కేంద్రం పనులు ● ఇంకా లభించని స్టేజ్‌–1 అనుమతులు ● ఈ సంవత్సరంలో ఉత్పత్తి లేనట్లే.. | - | Sakshi
Sakshi News home page

● గోలేటి ఓసీపీ ప్రారంభం కోసం తీవ్రంగా ప్రయత్నాలు ● కొనసాగుతున్న భూసేకరణ, పునరావాస కేంద్రం పనులు ● ఇంకా లభించని స్టేజ్‌–1 అనుమతులు ● ఈ సంవత్సరంలో ఉత్పత్తి లేనట్లే..

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

● గోలేటి ఓసీపీ ప్రారంభం కోసం తీవ్రంగా ప్రయత్నాలు ● కొనసాగుతున్న భూసేకరణ, పునరావాస కేంద్రం పనులు ● ఇంకా లభించని స్టేజ్‌–1 అనుమతులు ● ఈ సంవత్సరంలో ఉత్పత్తి లేనట్లే..

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా భవిష్యత్తుకు జీవం పోసే గోలేటి ఓసీపీ ఏర్పాటుకు అనుమతుల అడ్డంకులు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. యాజ మాన్యం ఈ ఓసీపీ ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. రెండేళ్ల క్రితమే గోలేటి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుందని సింగరేణి ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడం ప్రతిబంధంగా మారింది.

స్టేజ్‌– 1 అనుమతులే కీలకం

బెల్లంపల్లి ఏరియా ఒకప్పుడు భూగర్భ గనులు, ఓసీపీలతో కళకళలాడేది. కాలక్రమేణా భూగర్భ గనులు మూతపడగా, బొగ్గు నిల్వలు నిండుకుని ఓసీపీలు సైతం వాటి దారిలోనే మూతపడ్డాయి. ఒకానొక దశలో బెల్లంపల్లి ఏరియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏరియాకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా యాజమాన్యం కాలానుగుణంగా బొగ్గు ఉత్పత్తిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. భూగర్భ గనుల్లో ఆశించిన లాభాలు రాకపోవడం, లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో ఓసీపీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇందులో భాగంగా బెల్లంపల్లి ఏరియాకు మరో రెండు దశాబ్దాల పాటు ఢోకా ఉండకుండా గోలేటి, ఎంవీకే ఓసీపీ ఏర్పాటుకు సంస్థ ముందుకొచ్చింది. మూసివేతకు గురైన గోలేటి వన్‌, గోలేటి వన్‌– ఏ, అబ్బాపూర్‌ ఓసీపీ భూభాగాన్ని కలుపుకుని గోలేటి ఓసీపీకి రూపకల్పన చేసింది. ఈ ఓసీపీలో 38.98 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు అందుబాటులో ఉండగా.. ఏడాదికి సుమారు 3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టు కోసం 1358.28 హెక్టార్ల భూభాగం అవసరం ఉండగా ఇందులో 594.07 హెక్టార్ల భూమి ప్రస్తుతం సింగరేణి ఆధీనంలో ఉంది. మిగిలిన 665.914 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో 90 శాతం అటవీశాఖకు చెందిన భూమి ఉండటంతో గోలేటి ఓసీపీ ఏర్పాటు సమస్య జటిలంగా మారుతోంది. అటవీ భూముల అనుమతులకు స్టేజ్‌– 1 అనుమతులు ఎంతో కీలకం. వీటి కోసం సింగరేణి యాజమాన్యం దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. స్టేజ్‌–1 అనుమతులు వస్తే దాదాపు 90 శాతం సమస్య పరిష్కారం అయినట్లే. శ్రీరాంపూర్‌ ఏరియాలో 68.04 హెక్టార్లను సింగరేణి భూమిని అటవీశాఖకు అప్పగించారు. అయితే సింగరేణి అధికారుల అంచనా ప్రకారం జూన్‌ వరకు స్టేజ్‌–1 అనుమతులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నా దానిపై కచ్చితత్వం లేదు. అనంతరం ఈసీ, స్టేజ్‌– 2 అనుమతుల ప్రక్రియ చర్యలు మొదలుకానుంది.

కొనసాగుతున్న పునరావాస పనులు

గోలేటి ఓసీపీ ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే మరోవైపు ఇతర అడ్డంకులను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అవసరమైన ప్రైవేటు భూములను సేకరిస్తున్నారు. ఇప్పటికే సోనాపూర్‌ గ్రామంలో అవసరమైన 59 హెక్టార్ల భూమిని సేకరించి పరిహారం సైతం అందిస్తున్నారు. గోలేటి, సోనాపూర్‌ ప్రాంతంలో సింగరేణికి అవసరమైన మిగిలిన భూమిని సైతం త్వరలో సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక గోలేటి ఓసీపీ ఏర్పాటులో సోనాపూర్‌ గ్రామాన్ని తొలగించాల్సి ఉండగా.. వారి కోసం గోలేటిలోని సింగరేణి నర్సరీ సమీపంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్నిరకాల అనుమతులు వచ్చేలోగా పునరావాస కేంద్రాన్ని పూర్తి చేసి సోనాపూర్‌ వాసులను తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్టేజ్‌–1 అనుమతులు వచ్చాక చేపట్టాల్సిన స్టేజ్‌–2 అనుమతుల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికారుల అంచనా ప్రకారం జూన్‌ వరకు స్టేజ్‌–1 అనుమతులు వస్తాయని, జనవరిలోగా మిగిలిన అనుమతులు తీసుకుని ఓసీపీని ప్రారంభిస్తామని ఆశిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే జనవరిలో ఓసీపీలో ఓబీ పనులు మొదలై వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ మొదలవుతుంది.

తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం

గోలేటి ఓసీపీ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. స్టేజ్‌– 1 అనుమతులు వస్తే ఓసీపీ ఏర్పాటుకు మార్గం సులువైనట్లే.. శ్రీరాంపూర్‌ ఏరియాలో 68.04 హెక్టార్ల భూమిని అటవీశాఖ కోసం కేటాయించాం. ఇటీవల జిల్లా అటవీశాఖ అధికారి బదిలీ కావడంతో అనుమతుల ప్రక్రియ కొంత ఆలస్యమైంది. సోనాపూర్‌ ప్రజల కోసం పునరావాస కేంద్రం సిద్ధం చేస్తున్నాం. ఒకవైపు అటవీశాఖ భూమి కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు ప్రైవేటు భూమిని సేకరిస్తున్నాం. జూన్‌ వరకు స్టేజ్‌–1 అనుమతులు రావచ్చు. అవి రాగానే ఈసీతో పాటు స్టేజ్‌–2 అనుమతులు తీసుకుని జనవరిలో గోలేటి ఓసీపీలో ఓబీ పనులు మొదలుపెట్టేలా ప్రణాళికలు రూపొందించాం.

– విజయ భాస్కర్‌, బెల్లంపల్లి ఏరియా జీఎం

Advertisement
 
Advertisement
Advertisement