ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

● బస్టాండ్‌ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఏకైక కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. ఈ హృదయ విదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నికాడి గీత, భీంరావు దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి తరుణ్‌(14 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు. వాంకిడి మండలంలోని బంధువుల ఇంటి వద్ద శుభకార్యం ఉండటంతో కుటుంబ సభ్యులంతా వెళ్లి బుధవారం తిరుగుపయనమయ్యారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌కు చేరుకుని కాగజ్‌నగర్‌ వెళ్లే బస్సు ఎక్కేందుకు వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో కాగజ్‌నగర్‌ బస్సు ఎక్కేందుకు వెళ్తుండగా, ఉట్నూర్‌ డిపోకు చెందిన డ్రైవర్‌ బస్సును రివర్స్‌ తీస్తుండగా, బస్సు నానమ్మ ఒడిలో ఉన్న బాలుడికి తాకింది. దీంతో తరుణ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వైద్యులు మంచిర్యాలకు రెఫర్‌ చేశారు. మంచిర్యాలలో బాలుడిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

బస్టాండ్‌ ఎదుట ఆందోళన

బాలుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు తిరిగి ఆసిఫాబాద్‌కు చేరుకుని బస్టాండ్‌ ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, తెలంగాణ ఆదివాసీ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. బాలుడి మృతి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డీఎం రాజశేఖర్‌ అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. తక్షణ సహాయం కింద రూ.25 వేలు చెల్లిస్తామని, ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆందోళనల్లో వివిధ సంఘాల నాయకులు చిరంజీవి, దినకర్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement