ఆసిఫాబాద్: ఈ నెలాఖరులోగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్లు, సూపర్‌వైజర్లతో బుధవారం నియోజకవర్గ స్థాయి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు, ఏసీఎంలు, సూపర్‌వైజర్లు మ్యాపింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బూత్‌స్థాయి అధికారులు తమ పరిధిలోని ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. మరణించిన ఓటర్లు, గ్రామం వదిలి వెళ్లిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. సెర్ప్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున బూత్ స్థాయి ఏజెంట్ల జాబితా అందించాలన్నారు. అనంతరం తహసీల్దార్లతో ధాన్యం కొనుగోళ్లు, గోనె సంచుల లభ్యత, మొక్కజొన్న కొనుగోలు, భూభారతి దరఖాస్తుల పరిశీలన, ధ్రువపత్రాల జారీ, పెండింగ్ అంశాలపై సమీక్షించారు.
ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి
ఇళ్ల గణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జనగణన– 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్యుమరేటర్లకు వివరాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌ల్లో ప్రతీ ఇంటిని సందర్శించాలని ఆదేశించారు. ఇంటి యజమానులు కూడా సిబ్బందికి సహకరించి, పారదర్శకంగా వివరాలు అందించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 40 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసిఫాబాద్ డివిజన్‌లో ఐకేపీ ద్వారా 6 కేంద్రాలు, కాగజ్‌నగర్ డివిజన్‌లో ఐకేపీ ద్వారా 15 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
రైతుతో మాట్లాడి.. సూచనలు చేసి
రెబ్బెన: మండలంలోని కొమురవెళ్లికి కౌలుదారు సందీప్ తాను సాగు చేసిన పొలం వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనపై కలెక్టర్ హరిత స్పందించారు. బుధవారం సదరు కౌలురైతుతో ఫోన్‌లో మాట్లాడారు. తేమ, మట్టిగడ్డలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే తప్పకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అతను కొనుగోలు కేంద్రానికే ధాన్యం తీసుకువస్తానని తెలిపాడు.


