చింతలమానెపల్లి: జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ‘అదరక..బెదరక!’ అనే కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. బుధవారం కౌటాల మండల కేంద్రంలోని పశువుల సంతను ఎస్పీ నితిక పంత్ పరిశీలించి నిర్వాహకులు, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువులకు సరిపడా దాణా, తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వారసంతల్లో ఆవుల క్రయవిక్రయాలు నిషేధమని స్పష్టం చేశారు. పశువుల రవాణా, విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అనంతరం సిర్పూర్(టి) మండలంలోని పెద్దబండ చెక్‌పోస్ట్ పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్రమ రవాణాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో కౌటాల సీఐ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


