నిలిచిన పత్తి కొనుగోళ్లు
ఆసిఫాబాద్: జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ నిబంధనలు సడలించాలని డిమాండ్ చేస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం ప్రైవేటు, సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో పంటను అమ్ముకోవడం ఎలా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కొన్ని ప్రాంతాల్లో రైతులు తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తున్నారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు..
ఈ నెల 6న జిల్లా కేంద్రంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. జిల్లాలోని 24 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం 10 మిల్లుల్లోనే కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ క్రమంలో తేమ శాతం 8 నుంచి 12 శాతానికి పెంచాలని, పత్తి ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసేలా నిబంధనలు సడలించాలని డిమాండ్ చేస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కోరుతున్నాయి. జిన్నింగ్ మిల్లుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొనుగోళ్లు నిలిపి వేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి అశోక్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. కాగా, కొనుగోళ్లు నిలిపివేత గురించి రైతులకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు సమాచారం అందించారు. దీంతో పంటను విక్రయించేందుకు రైతులు జిన్నింగ్ మిల్లులకు రాలేదు.
ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఎలాంటి నిబంధనలు లేకుండా సీసీఐ కేంద్రాల ద్వారా రైతుల నుంచి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని బీసీ యువజన సంఘం నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్ర ణయ్ మాట్లాడుతూ కపాస్ కిసాన్ యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎకరానికి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో ఎక్కువ మంది ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ చొరవ చూపి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మారుతి తదితరులు ఉన్నారు.


