తలసేమియా బాధితులను ఆదుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు వందమంది తలసేమియా వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ తలసేమియా బాధితులకు దివ్యాంగుల పింఛన్ అందించాలని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తాన్ని ఎక్కించడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తుల కోసం తరచూ సదరం శిబిరాలు నిర్వహించాలన్నా రు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యనందించేందుకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. జిల్లాలోని గర్భిణులకు హెచ్‌బీఏ 2 తలసేమియా, సికిల్‌సెల్ పరీక్షలు చేయాలని డిమాండ్ కోరారు. కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ నాయకులు రత్నం తిరుపతి, బాపురావు, జాడి శ్రీనివాస్, దయాకర్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.


