అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్..!
అమృత్ భారత్ పథకంలోకి కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ మూడో ప్లాట్‌ఫాంపై సౌకర్యాల కల్పనకు త్వరలో నిధులు తొలగనున్న ప్రయాణికుల కష్టాలు
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకంలో కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు చోటు దక్కింది. స్టేషన్‌లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. త్వరలోనే టెండర్ల పక్రియ అనంతరం అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సమస్యలు వివరిస్తూ రైల్వే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీనికి స్పందనగా వారు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చినట్లు, త్వరలోనే పనులను చేపడుతామని ఎమ్మెల్యేకు పంపిన లేఖలో వివరించారు.
కనీస సౌకర్యాలు కరువు
భాగ్యనగర్, కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్‌లు కాగజ్‌నగర్ స్టేషన్‌లోని మూడో ప్లాట్‌ఫాంకు వచ్చి తిరిగి ప్రయాణమవుతాయి. ఈ రైళ్లలో వెళ్లే ప్రయాణికులు మూడో ప్లాట్‌ఫాంపైకి రావాలి. కానీ అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. టికెట్‌కౌంటర్, ఎస్కలేటర్, మూత్రశాలలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కేవలం ఫ్లై ఓవర్ వంతెనలు మాత్రమే ఉండగా.. మెట్లు ఎక్కడానికి వృద్ధులు, పిల్లలు అపసోపాలు పడుతున్నారు.
మారనున్న రూపురేఖలు
అమృత్ భారత్ కింద వచ్చే నిధులతో కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఈ నిధులతో నూతన భవన నిర్మాణంతోపాటు ప్రవేశ ముఖద్వారం, ఎస్కలేటర్, లిఫ్ట్‌లు, బుకింగ్ కార్యాలయాలు, మూత్రశాలలు, నీటి సౌకర్యంతోపాటు ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. ఫ్లైఓవర్ వంతెనలు వెడల్పు చేయడంతోపాటు మూడు ప్లాట్‌ఫారాలకు మూడు లిఫ్ట్‌లు, రెండో ప్రవేశ ద్వారంలో టికెట్ కౌంటర్, వెయిటింగ్‌హాల్‌తో పాటు మూడు వాటర్ కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు త్వరలోనే టెండర్ల పక్రియను పూర్తి చేసి పనులు కొనసాగిస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ ప్రకటించారు.
రైల్వే స్టేషన్‌లోని మూడో ప్లాట్‌ఫాం
పనులు త్వరగా చేపట్టాలి
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ 1 నుంచి 2, 3కు లగేజీలతో వెళ్లేందుకు వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను త్వరగా చేపట్టాలి. 3వ ప్లాట్‌ఫాంపై టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. అలాగే పార్కింగ్ సౌకర్యం కల్పించాలి.
– ఆవుల రాజ్‌కుమార్, కాగజ్‌నగర్
సంతోషంగా ఉంది
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చడం చాలా సంతోషంగా ఉంది. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో నెలకొన్న సమస్యలు ఈ పథకం ద్వారా తొలగిపోతాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి.
– అన్నం నాగార్జున, కాగజ్‌నగర్
అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్..!
అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్..!


