చిరుతల సంచారం.. భయాందోళనలో జనం
కెరమెరి/కాగజ్‌నగర్‌రూరల్: జిల్లాలో పెద్దపులులతో పాటు చిరుతల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెబ్బులి పశువులపై దాడులకు తెగబడుతూ హతమారుస్తోంది. తాజాగా సోమవారం కెరమెరి మండలం కెలి– బి, కాగజ్‌నగర్ మండలం కడంబా అటవీ ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం కలకలం రేపింది.
మహారాష్ట్ర నుంచి కెలి–బి వైపు..
కెరమెరి మండలం కెలి– బి గ్రామ సమీపంలోని చేలల్లో సోమవారం చిరుత ఓ రైతు కంటపడింది. చేను నుంచి నడుచుకుంటూ మహారాష్ట్ర వైపు వెళ్లిందని సదరు రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఎఫ్‌ఆర్‌వో మజారొద్దీ న్ సిబ్బందితో కలిసి కెలి– బి అడవులు, పత్తి చేలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్ర నుంచి తరుచూ కెరమెరి మండలంలోని పలు ప్రాంతాలకు చిరుత రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు. తడోబా కారిడార్ ప్రాంతం కెరమెరికి సమీపంలో ఉండటంతో ఇటు వైపు రావడం సహజమేనని అన్నారు. రైతులు పంట పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కడంబా అటవీ ప్రాంతంలో..
కాగజ్‌నగర్ మండలంలోని కడంబా అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. సోమవారం రాత్రి కాగజ్‌నగర్ నుంచి బెజ్జూర్‌కు వెళ్తున్న అయ్యప్ప స్వాములకు కడంబా గ్రామ సమీపంలోని భీమన్న ఆలయం వద్ద చిరుత పులి ఎదురైంది. కారులో వెళ్తున్న వారు సెల్‌ఫోన్‌లో చిరుత వీడియోలు, ఫొటోలు తీసే ప్రయత్నం చేసినప్పటికీ కెమెరాకు దొరకలేదు. ఇదే విషయంపై ఫారెస్ట్ రేంజ్ అధికారి అనిల్ కుమార్‌ను సంప్రదించగా.. కడంబా అటవీ ప్రాంతంలో చిరుత సంచారం ఉందని స్పష్టం చేశారు. రాత్రిపూట ఆ మార్గంలో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


