కాగజ్‌నగర్‌లో నిఘా నేత్రాలు
కాగజ్‌నగర్‌టౌన్: ఆధునిక కాలంలో నిఘా కెమెరాలు అత్యంత కీలకంగా మారాయి. నేర అన్వేషణ, ప్రమాదాలకు సంబంధించిన వ్యవహారాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు వినియోగించుకుంటున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో ఇటీవల దొంగతనాలు, ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో పోలీసుశాఖ నిఘా పెంచుతోంది. చోరీలకు అడ్డుకట్ట వేసి నేరస్తులను సులువుగా పట్టుకునేందుకు జనసంచారం ఎక్కువ ఉండే ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓల్డ్ కాలనీ, రైల్వే కాలనీ, రాజీవ్ గాంధీ చౌరస్తా, ఎస్పీఎం క్వార్టర్స్, న్యూ కాలనీ, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, తెలంగాణ తల్లి చౌరస్తాల్లో 35 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌరస్తా, మార్కెట్ ఏరియాల్లో 23 సీసీ కెమెరాలు బిగించారు. బస్టాండ్ సమీపంలో మరో 15 ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేకంగా సిబ్బంది
మినీ ఇండియాగా పిలిచే కాగజ్‌నగర్ పట్టణం పారిశ్రామికంగా అత్యంత కీలకమైంది. వివిధ ప్రాంతాలకు చెందిన కూలీలు, వ్యాపారులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. రైల్వే, రోడ్డు మార్గాలు అనుకూలంగా ఉండటం, మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోనే ఉండటంతో నేరాల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో పోలీసు అధికారులు పట్టణంలో శాంతిభద్రతలపై దృష్టి సారించారు. మొదటి విడతగా 58 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో బిగించిన కెమెరాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఇద్దరు పోలీసు సిబ్బందిని సైతం నియమించారు. వీరు రాత్రి, పగలు నిర్వహణ బాధ్యతలు చూసుకోనున్నారు.
నిరంతరం పర్యవేక్షణ
రద్దీగా ఉండే మా ర్కెట్ ఏరియాలో 23 సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతాం. బస్టాండ్ ఏరియాలో మరో రెండు రోజుల్లో 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. పట్టణంలోని అన్ని ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తాం.
– వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్
కాగజ్‌నగర్‌లో నిఘా నేత్రాలు


