నీటి వనరుల గణనకు వేళాయె
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో చిన్ననీటి వనరుల గణనకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. సోమవారం నుంచి నెలరోజులపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, బావుల వివరాలు సేకరించనున్నారు. ఈ గణన ద్వారా గ్రామాల్లో ఎన్ని నీటి వనరులు ఉన్నాయి.. నీటి లభ్యత లెక్క తేలనుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జలశక్తి కార్యక్రమం కింద సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో పొందుపరుస్తారు. సాధారణంగా ప్రతీ ఐదేళ్లకు ఒకసారి చిన్ననీటి వనరులను లెక్కిస్తారు. గతంలో 2017– 18లో గణన చేపట్టారు. అప్పటి లెక్కల ప్రకారం జిల్లాలో బావులు 2,513 ఉండగా, బోర్లు 3,738, చెరువులు, కుంటలు కలిపి 1,865 ఉన్నాయి.. ఈ నెల 17 నుంచి నెలరోజులపాటు చేపట్టే సర్వేలో గొట్టపు, ఓపెన్ బావులు, చెరువులు, చిన్న కుంటలు, రెండు వేల హెక్టార్లలోపు ఆయకట్టుకు సాగునీరందించే మినీ ప్రాజక్టుల వివరాలు సేకరిస్తారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చైర్మన్‌గా కలెక్టర్
నీటి వనరుల లెక్కింపు కార్యక్రమానికి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా జిల్లా ప్లానింగ్ అధికారులు కన్వీనర్‌గా ఉంటారు. గ్రామ పరిపాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు సర్వే చేపట్టనున్నారు. గణన కోసం ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు. తహసీల్దార్లు వీరి సమన్వయ బాధ్యతలు చూస్తుండగా, సీపీవోపాటు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పర్యవేక్షిస్తారు.
ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో చిన్ననీటి వనరుల గణన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు పూర్తి చేశాం. సంబంధిత సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయింది. నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.
– వాసుదేవరెడ్డి, సీపీవో


