బోనస్ దక్కేనా..?
యాసంగిలో సన్నరకం ధాన్యానికి అందని వైనం జిల్లాలో జోరందుకున్న వానాకాలం వరికోతలు ఈ సీజన్‌లోనైనా బోనస్ నగదు చెల్లించాలని రైతుల వేడుకోలు
రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన వడాయి కాంతారావు అనే యువ రైతు గత యాసంగిలో సన్నరకం ధాన్యం సాగు చేశాడు. ధాన్యంలో కొంత ప్రైవేటు వ్యక్తులకు విక్రయించగా.. క్వింటాల్‌కు రూ.500 బోనస్ వస్తుందనే ఆశతో మరో 50 క్వింటాళ్ల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నాడు. వానాకాలం సీజన్ ముగింపునకు వచ్చినా ఇప్పటివరకు బోనస్ నగదు అందలేదు. ఈ వానాకాలంలోనైనా బోనస్ అందుతుందనే ఆశతో ఐదెకరాల్లో సన్నరకం వరి సాగు చేశాడు... ఇలా జిల్లాలోని చాలామంది రైతులు వానాకాలంలో సన్నరకం వరి సాగు చేశారు.
రెబ్బెన(ఆసిఫాబాద్): వరిసాగు చేసే రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి బోనస్ ప్రకటించింది. గతేడాది వా నాకాలం పంట దిగుబడులకు బోనస్ చెల్లించిన ప్ర భుత్వం.. యాసంగిలో రైతుల నుంచి కొనుగోలు చే సిన ధాన్యానికి చెల్లించలేదు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వరికోతలు ఊపందుకున్నాయి. కనీసం ఈ సారైనా ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్ చె ల్లిస్తుందా.. లేదా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
తుపానుతో తీవ్ర నష్టం
జిల్లాలోని కాగజ్‌నగర్, సిర్పూర్(టి), దహెగాం, బెజ్జూర్, కౌటాల, పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి, రెబ్బెన, ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో సుమారు 52వేల ఎకరాల్లో వరి సాగైంది. పత్తి పంట తర్వాత అత్యధికంగా వరి పంట మోంథా తుపానుకు దెబ్బతింది. మూడు రోజులపాటు కురిసిన అకాల వర్షాలతో కోతదశకు చేరిన పొలాల్లోని పైరు నేలవాలింది. దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. రోజుల తరబడి నీళ్లలోనే ఉండటంతో ధాన్యం మొలకలు వచ్చాయి. తుపానులో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. వర్షాలతో నీటితో నిండిన పొలాలు ఇప్పుడిడప్పుడే తడారుతుండటంతో అన్నదాతలు కోతలపై దృష్టి సారించారు. టైర్లతో నడిచే సాధారణ హార్వెస్టర్లు నడిచే పరిస్థితి లేకపోవడంతో చైన్ ట్రాక్ హార్వెస్టర్లపై ఆధారపడుతున్నారు.
అన్నదాతల్లో ఆశలు
ఈ సీజన్‌లో దాదాపు 90 శాతం మంది సన్నరకం వరి సాగు చేశారు. వరికోతలు మొదలై 15 రోజులు అవుతున్నా అధికారులు ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. బోనస్ వస్తుందనే ఆశతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఎదురుచూస్తున్నారు. దిగుబడి తక్కువగా ఉండటంతో బోనస్ కొంత అండగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389 చెల్లిస్తుండగా, సాధారణ రకానికి రూ.2,369 చెల్లిస్తోంది. ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు క్వింటాల్‌కు రూ.2,000 నుంచి రూ.2,100 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా కల్లాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం 17 మించకూడదనే నిబంధన ఉంది. తప్ప, తాలు ఉండకుండా చూసుకోవాలి. తప్ప, తాలు ఉంటే తూర్పారా పట్టి విక్రయించాలి. తూకం, హమాలీ ఖర్చులను రైతులే భరించాలి. దీంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు.
బోనస్ చెల్లిస్తేనే లాభం
ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యానికి బోనస్ చెల్లిస్తేనే రైతులకు లాభం ఉంటది. ప్రైవేటోళ్లు వచ్చి పచ్చి వడ్డనే కొని తీసుకుపోతున్నరు. కాంటా ఖర్చు కూడా అడుగుతలేరు. అదే ప్రభుత్వ కేంద్రంలో క్వింటాల్‌కు రూ.50 చొప్పున హమాలీ ఖర్చు రైతులే భరించాల్సి వస్తుంది.
– వడ్గూరి విజయ్, రైతు
యాసంగి నగదు అందలేదు
పోయిన నెలలో తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాతో పంటలన్నీ దెబ్బతిన్న యి. సరిగ్గా గింజ పాలుపోసుకునే సమయంలో పంట తీవ్రంగా దెబ్బతింది. బోనస్ వస్తుందనే ఆశతో గత యాసంగిలో సన్నవడ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే బోనస్ నగదు అందలేదు. వానాకాలంలో కూడా సన్నవడ్లనే సాగుచేసిన. ఈసారైనా బోనస్ పడుతుందో లేదో తెలుస్తలేదు.
– శివరాం, నక్కలగూడ
బోనస్ దక్కేనా..?
బోనస్ దక్కేనా..?


