పత్తి కొనుగోళ్లకు బ్రేక్
ఆసిఫాబాద్: సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించా రు. జిల్లాలో ఈ నెల 6న సీసీఐ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు, తమకు ఆటంకంగా మారుతున్నాయని జి న్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కపాస్ కిసాన్ యాప్‌తో స్లాట్ బుకింగ్, ఎకరాకు ఏ డు క్వింటాళ్ల పరిమితితోపాటు తేమ కూడా ఎనిమి ది శాతానికి తగ్గించారు. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళన చే పట్టారు. తాజాగా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోళ్లు నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు.
10 మిల్లుల్లోనే కొనుగోళ్లు
జిల్లాలో 1.48 లక్షల రైతులుండగా ఈ ఏడాది 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. 38లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. ఈ ఏడాది ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,100 ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 24 జిన్నింగ్ మిల్లులుండగా ఇప్పటివరకు పదింటిలోనే సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించింది. ఈ నెల 6న ఆసిఫాబాద్, 10న జైనూర్, 14న కాగజ్‌నగర్‌లో పత్తి కొనుగోళ్లు ప్రా రంభించారు. వారంరోజుల్లో జిల్లా వ్యాప్తంగా 32,753 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, వీటిలో సీసీఐ ద్వారా 25,536 క్వింటాళ్లు, ప్రైవేట్‌లో 7,217 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి.
రైతులపై తీవ్ర ప్రభావం
మార్కెట్‌లో సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోతే రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది. పత్తి కొనేవారు లేక ధర తగ్గే ప్రమాదముంది. క్వింటాల్‌కు రూ.8,100 సీసీ ఐ చెల్లిస్తుండగా, ప్రైవేట్‌లో రూ.6,500 ఇస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిన్నింగ్ యజమానుల సమస్య పరిష్కారమయ్యేదాకా రైతులు మార్కెట్‌కు పత్తి తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోళ్లు సక్రమంగా జరిగేందు కు రైతులు, మిల్లర్లకు అనుకూలంగా మార్గదర్శకా లు వస్తేనే సమస్య పరిష్కారం కానుంది.
జిన్నింగ్ యజమానుల డిమాండ్లివే..
పత్తి కొనుగోళ్ల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మిల్లుల్లో యజమానులు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎల్1, ఎల్2, ఎల్3 పేరిట కొన్ని మిల్లుల్లోనే కొనుగోళ్లు చేపట్టడంపై రైతులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు తమ ఉనికిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లాలో అన్ని మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టగా, తాజా నిబంధనలు రైతులు, జిన్నింగ్ యజమానులకు ఇబ్బందిగా మారాయి. ఈ క్రమంలో కొన్ని మిల్లుల్లోనే విడతల వారీగా కొనుగోళ్లు చేపట్టడంతో కొనుగోళ్లు ప్రారంభించని మిల్లు యజమానులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
17నుంచి కొనుగోళ్ల్లు నిలిపివేత
ఆసిఫాబాద్: ఈ నెల 17నుంచి జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులకు పని కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో ఎల్1, ఎల్2, ఎల్3 సిస్టం ఎత్తివేయాలని, రైతులకు అందుబాటులో ఉన్న మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టాలని యజమానులు డిమాండ్ చేస్తూ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు గమనించి, తదుపరి కొనుగోళ్ల తేదీ ప్రకటించే వరకు సహకరించాలని కోరారు.


