దేశ పురోగతికి కలిసి నడుద్దాం
ఆసిఫాబాద్: దేశ పురోగతికి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కలిసి నడుద్దామని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి హాజరయ్యారు. జెండా ఊపి ఐక్యత ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కుమురంభీం చౌరస్తా మీదుగా మళ్లీ కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం వల్లాభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ దేశ ఐక్యత కోసం వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఏక్ భారత్– ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులను వినియోగించి ఆర్థిక రంగాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ హోంశాఖ మంత్రిగా వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత, అభివృద్ధిలో పాలు పంచుకున్నారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ యువత పటేల్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మేరా భారత్ కార్యక్రమం ఇన్‌చార్జి, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, నోడల్ అధికారి రమాదేవి, జిల్లా యువజన శాఖ క్రీడల అధికారి అహ్మద్, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


