నాణ్యమైన విద్యను అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కస్తూరి బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవం, తల్లిదండ్రుల సమావేశానికి హాజరయ్యారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎంఈవో సుభాష్, ఎస్‌వో భాగ్యలక్ష్మి, నలంద పాల్గొన్నారు.
భవిత కేంద్రాల్లో వసతుల కల్పనకు చర్యలు
భవిత కేంద్రాల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మానసిక దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాల భవనాలకు మరమ్మతులు చేసి ర్యాంపుల నిర్మాణం, ఫ్యాన్లు, గ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, మూత్రశాలలు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎస్‌వో అబిద్ తదితరులు పాల్గొన్నారు.


