శ్రావణి కుటుంబానికి అండగా ఉంటాం
ఆసిఫాబాద్‌అర్బన్: దహెగాం మండలం గెర్రె గ్రామంలో అక్టోబర్ 18న హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి శ్రావణి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు, ఇంటి నిర్మాణానికి మహిళా సమాఖ్య నుంచి రూ.లక్ష రుణం చెక్కు, అట్రాసిటీ కేసు పరి హారం ఉత్తర్వులు, మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించే ఉత్తర్వులను అందజేశా రు. కలెక్టర్ మాట్లాడుతూ శ్రావణి తండ్రి చెన్నయ్య పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, ఇంటి నిర్మాణానికి మండల సమాఖ్య నుంచి రూ.లక్ష రుణం చెక్కు అందిస్తున్నామని తెలిపారు. అట్రాసిటీ కేసు కింద మొదటి విడత పరిహారంగా రూ.4,12,500 మంజూరు ఉత్తర్వులు అందించామని పేర్కొన్నారు. శ్రావణి తల్లిదండ్రులకు ఉపాధి కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దుకాణం పెట్టుకునేందుకు, సోదరుడిని గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ శ్రావణిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గృహ నిర్మాణశాఖ పీడీ ప్రకాశ్‌రావు, డీఆర్‌డీవో దత్తారావు, దహెగాం తహసీల్దార్ షరీఫ్, ఎంపీడీవో నస్రుల్లా, ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు.


