‘బీసీ ఉద్యమ సెగ ఢిల్లీకి తగలాలి’
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమ సెగ ఢిల్లీకి తగలాలని బీసీ జేఏసీ చైర్మన్ రూప్‌నార్ రమేశ్ అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గురువారం ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. జేఏసీ చైర్మన్ రమేశ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్‌గాంధీ ఇండియా కూటమి నేతలతో కలిసి బీసీల తరఫున పోరాటం సాగించాలని కోరారు. తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ నెల 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్, 18న ఎంపీలతో ములాఖత్, డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ ముట్టడి, మూడో వారంలో బస్సుయాత్ర, జనవరి 4న వేలవృత్తులు– కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, నాయకులు రేగుంట కేశవ్‌రావు, జక్కన్న, రమేశ్, మేరాజ్, మారుతి, అశోక్, మోరేశ్వర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


