కోతలు భారం..!
అకాల వర్షాలకు బురదమయంగా వరిపొలాలు నేలవాలిన వరి కోసేందుకు తీవ్ర ఇబ్బందులు చైన్ మిషన్లతో కోతలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు
పెంచికల్‌పేట్(సిర్పూర్): అకాల వర్షాల దెబ్బకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తెగుళ్లు, ఎడతెరిపి లేని వర్షాలతో దిగుబడి అంతంత మాత్రంగా ఉండగా, వరికోతలకు అన్నదాతలపై అదనపు భారం పడుతోంది. రూ.వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంట అకాల వర్షాలకు దెబ్బతినగా, కోతకు వచ్చిన పంట నేలవాలింది. పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో కోతలకు పడరాని పాట్లు పడుతున్నారు. నేలవాలిన వరి, నీట మునిగిన పైరును కోసేందుకు చైన్ మిషన్లు వినియోగిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 55 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. 2025– 26 వానాకాలం సీజన్‌లో 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల మోంథా తుపాను ప్రభావంతో పెంచికల్‌పేట్, దహెగాం, కౌటాల తదితర మండలాల్లో అకాల వర్షాలకు వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరి పైరు నేలవాలింది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికీ నీరు నిలిచి ఉండగా, కొన్నిచోట్ల పొలాల్లో తడి ఆరడం లేదు. బురదతో హార్వెస్టర్లు నడవడం కష్టంగా మారింది. దీంతో వరి పంట కోయడానికి అన్నదా తలు రెట్టింపు ఖర్చు చేస్తున్నారు. టైర్ల హార్వెస్టర్ల యజమానులు గంటకు రూ.1800 నుంచి రూ.2వేలు, చైన్ మిషన్ యజమానులు గంటకు రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారు. బురద, నీటి నిల్వ కారణంగా ట్రాక్టర్లు కూడా పొలాల్లోకి వెళ్లడం సాధ్యం కావడం లేదు. హార్వెస్టర్ ట్యాంకు నిండిన ప్రతీ సారి పొలం దాటి గెట్టుకు రావాల్సి వస్తోంది. దీంతో కోత సమయం పెరుగుతుండటంతో అదనంగా చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రూ.12వేలు ఖర్చు
మూడెకరాల్లో వరి పంట సాగు చేశాను. పంట కోతకు వచ్చిన సమయంలో కురిసిన భారీ వర్షాలకు పైరు నేలవాలింది. కోత కోయడానికి పొలంలో టైర్ల హార్వెస్టరు పని చేయలేదు. చైన్ మిషన్ హార్వెస్టరుకు రూ.12వేలు చెల్లించి కోత పూర్తి చేశా. వర్షాలతో గతంలో కంటే సుమారు రూ.6వేలు అధికంగా ఖర్చయ్యింది.
– సుంపుటం బక్కయ్య, పెంచికల్‌పేట్
చైన్ మిషన్‌తో వరి కోయిస్తున్న రైతు
కూలీలతోనూ ఇబ్బందే..
హార్వెస్టర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో రైతులు కూలీల సాయంతో వరికోతలు చేపడుతున్నారు. పొలాలు బురదమయంగా ఉండటంతో కోసిన వరిని గెట్లపై కుప్పలుగా పెడుతున్నా రు. దీనికి సమయం వృథా అవుతోంది. వరి కో త, కుప్పలు ఎత్తడం, నూర్పిడి అన్ని కలిపి రూ. 5వేల నుంచి రూ.7వేల వరకు ఖర్చు పెరిగిందని చెబుతున్నారు. అకాల వర్షాలు నిండా ముంచాయని, ప్రభుత్వం నిబంధనలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
కోతలు భారం..!
కోతలు భారం..!


