జిల్లాకు కొత్త అతిథి | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు కొత్త అతిథి

Nov 13 2025 8:30 AM | Updated on Nov 13 2025 8:30 AM

జిల్లాకు కొత్త అతిథి

జిల్లాకు కొత్త అతిథి

సరిహద్దు దాటి మహారాష్ట్ర నుంచి పెద్దపులి రాక మూడు నెలలుగా ఈ ప్రాంతంలోనే సంచారం ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి అడుగుపెట్టిన కొత్త పెద్దపులి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆరాటపడుతోంది. మూడు నెలల క్రితం జిల్లాలోకి ప్రవేశించగా, ప్రస్తుతం రెబ్బెన, తిర్యాణి రేంజ్‌ పరిధిలో సంచరిస్తూ ఆహారం కోసం పశువులపై పంజా విసురుతోంది. రెబ్బెన, తిర్యాణి, దేవాపూర్‌, బెల్లంపల్లి రేంజ్‌ పరిధిలోని అటవీ ప్రాంతం కొత్త పులి నివాసానికి అనుకూలంగా ఉంది. దట్టమైన అడవుల్లో పుష్కలంగా నీటి వనరులు, ఆకలిని తీర్చుకునేందుకు వన్యప్రాణులు ఉన్నాయి. ప్రస్తుతం పులుల మేటింగ్‌ సమయం కావడంతో జత దొరికితే ఈ ప్రాంతాల్లోనే బెబ్బులి ఆవాసం ఏర్పాటు చేసుకుని సంతతిని వృద్ధి చేసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.

పశువులపై పంజా..

రెండు రోజుల క్రితం కై రిగూడకు సమీపంలో రెండు పశువులపై పంజా విసిరిన పులి ఆడదా.. మగదా అనేది తేలలేదు. సోమవారం రాత్రి ఆవుతోపాటు లేగదూడలను చంపిన తర్వాత లేగదూడ కాలు మాంసాన్ని తినగా, ఆపై కళేబరాలను అక్కడే వదిలివెళ్లిపోయింది. ఆహారం కోసం మళ్లీ వస్తే జా డ తెలుసుకునేందుకు అటవీ అధికారులు పశువుల కళేబరాల ప్రాంతంలో ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా అందులో ఎలాంటి రికార్డు లేదు. కైరిగూడ సమీపంలో పశువులపై దాడికి ముందే తిర్యాణి రేంజ్‌ పరిధిలోని తోయగూడలో సైతం రెండు పశువులను చంపింది. కై రిగూడ సమీపంలోని పశువుల కళేబరాలకు వద్దకు రాకుండా పెద్దపులి తోయగూడ వైపు వెళ్లి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే తిర్యాణి రేంజ్‌ పరిధిలోనూ ఎక్కడా జాడ దొరకలేదు. దీంతో సిబ్బంది పులి సంచరించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

మైనింగ్‌ కార్యకలాపాలతో కాస్త ఇబ్బంది

మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి పులుల రాకపోకలు ఈ మధ్య పెరిగాయి. మహారాష్ట్రలోని తడోబా టైగర్‌ రిజర్వ్‌ నుంచి ప్రాణహిత దాటి జిల్లాలోకి అడుగుపెడుతున్న పులులు కాగజ్‌నగర్‌, రెబ్బెన, తిర్యాణి రేంజ్‌ల్లో సంచరిస్తూ ఆహారం కోసం పశువులపై దాడులు చేస్తున్నాయి. స్థిర నివాస అన్వేషణలో భాగంగా పులి రోజుకు 25 కిలోమీటర్లు తిరుగుతుంది. కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతం నుంచి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ వైపు వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టినా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ వైపు వెళ్లే మార్గంలో సింగరేణి బొగ్గు గని మైనింగ్‌ కార్యకలాపాలు ప్రతిబంధకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. వాహనాల శబ్దాలు, బ్లాస్టింగ్‌ పనులతో పులి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ వైపు వెళ్లకుండా మంచిర్యాల వైపు లేదా వచ్చిన దారిలోనే తిరుగు పయనం అవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. రెబ్బెన, ఆసిఫాబాద్‌ మండలాల మీదుగా ఏర్పాటు చేసిన జాతీయ రహదారిని పులులు, ఇతర వన్యప్రాణులు సులువుగా దాటేందుకు రెబ్బెన మండలం తక్కళ్లపల్లి వద్ద సుమారు 200 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మించారు. పైనుంచి వాహనాలు, కింది నుంచి వన్యప్రాణులు సురక్షితంగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అలాగే వాంకిడి మండలంలో ఏకో బ్రిడ్జి నిర్మించారు. ఆ ప్రాంతంలో వాహనాలు కింది నుంచి, వన్యప్రాణులు పైనుంచి వెళ్లేలా వంతెన నిర్మించారు.

గతంలో గోలేటి– 1 ఇంకై ్లన్‌ వద్ద..

దాదాపు ఐదేళ్ల క్రితం గోలేటి– 1 ఇంక్లైన్‌ వద్ద ఓ పెద్దపులి సంచరించింది. గోలేటి– 1 వద్ద నివాస గృహాలకు అతి సమీపంలోనే ఎద్దుపై దాడిచేసి చంపింది. కళేబరం వద్ద ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేయగా అందులో పులి కదలికలు రికార్డయ్యాయి. జనసంచారం, వాహనాల శబ్దాలకు పులి అక్కడి నుంచి బెల్లంపల్లి ఓసీపీ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లిపోయింది. కొన్ని రోజులపాటు అదే ప్రాంతంలో తిరగగా సింగరేణి కార్మికులు కొందరు ప్రత్యక్షంగా చూశారు. అక్కడి నుంచి ఖైరిగూర ఓసీపీ పరిసరాలకు వెళ్లిపోయి.. వట్టివాగు డైవెర్షన్‌ కెనాల్‌లో కనిపించిది. అక్కడి నుంచి తిరిగి గోలేటి– 1 మీదుగా పులికుంట వైపు వెళ్లి రెబ్బెన, బెల్లంపల్లి రేంజ్‌ల సరిహద్దు ప్రాంతమైన తక్కళ్లపల్లి బస్టాండ్‌ సమీపం గుండా మంచిర్యాల జిల్లా వైపు అడుగులు వేసింది. వేమనపల్లి, నీల్వాయి అటవీప్రాంతంలో చాలా రోజులు సంచరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement