విద్యార్థి ఆత్మహత్యపై పాఠశాలలో ఉద్రిక్తత
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఓ విద్యార్థి ఇటీవల పాఠశాలలో జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడగా శుక్రవారం విద్యార్థి కుటుంబసభ్యులు, బంధువులు పాఠశాలలో ఆందోళనలు చేపట్టి, ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పలువురు గ్రామ వీడీసీ సభ్యులు ఆందోళన చేసే వారిని సముదాయించే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకునే స్థాయికి గొడవ చేరడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎస్సై రాహుల్ గైక్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలని, ఆందోళన సరికాదని హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది. మృతి చెందిన విద్యార్థి తల్లి గంగమణి మాట్లాడుతూ పాఠశాలలోని ఉపాధ్యాయులు, వసతి గృహం అధికారుల అత్యుత్సాహంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. తమ కుమారుడు చేసిన తప్పేంటో తమకు చెప్పకుండానే తెల్లకాగితంపై సంతకం చేయించుకుని టీసీ ఇచ్చి పంపించారన్నారు. ఈ ఘటనలో పోలీసులు సైతం కేసు నమోదు చేశారని, వీటన్నింటితో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. అడగడానికి పాఠశాలకు వచ్చిన తమకు సమాధానం చెప్పకుండా దూషించి దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


