మూడు ముక్కలాట! | - | Sakshi
Sakshi News home page

మూడు ముక్కలాట!

Nov 8 2025 7:24 AM | Updated on Nov 8 2025 7:24 AM

మూడు ముక్కలాట!

మూడు ముక్కలాట!

ఆన్‌లైన్‌పై నిషేధం ఉండటంతో ఆఫ్‌లైన్‌పై ఫోకస్‌ మారుమూల ప్రాంతాల్లో పేకాట స్థావరాల ఏర్పాటు చేతులు మారుతున్న లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్న కుటుంబాలు

ఈ నెల 3న దహెగాం మండలం బీబ్రా గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 5,960 నగదు స్వాధీనం చేసుకున్నారు.

రెబ్బెన మండలం నంబాల గ్రామ శివారులో గత నెల 26న పేకాడుతున్న ఐదుగురి ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,330 నగదు స్వాధీనం చేసుకుని ఎస్సై వెంకటకృష్ణ కేసు నమోదు చేశారు.

గత నెల 16న చింతలమానెపల్లి మండలం బాబాసాగర్‌ గ్రామంలో ఐదుగురు జూదరులు, రూ.16,080 నగదును జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

గత నెల 13న సిర్పూర్‌(టి) మండలం లోనవెల్లి గ్రామంలో పేకాడుతున్న ఎనిమి ది మందిని జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. రూ.1,767 నగదు స్వాధీనం చేసుకున్నారు.

తిర్యాణి(ఆసిఫాబాద్‌): సులువుగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో కొందరు పేకాట వంటి జూదాలకు బానిసలుగా మారుతున్నారు. సరదాగా కోసం ప్రారంభించి.. క్రమంగా తమ కుటుంబాల ను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. స్థిరచరాస్తులు అమ్ముకుని ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. పోలీసులు అడపాదడపా దాడులు చేస్తూ కొంతమందిని అరెస్టు చేస్తున్నా.. నిందితులు మళ్లీ అదే ఆట వైపు వెళ్తున్నారు. గతంలో జూదరులు ఎక్కువగా ఆన్‌లైన్‌లో రమ్మీ కల్చర్‌ యాప్‌ల ద్వారా పేకాట ఆడేవారు. తెలంగాణ కొన్నేళ్లుగా గేమింగ్‌ యాక్ట్‌ అమలు ఉండటంతో ఆన్‌లైన్‌ జూదం అనుమతి ఉన్న ఇతర రాష్ట్రాల లొకేషన్‌ను ఫేక్‌ జీపీఎస్‌ ద్వారా ఎంపిక చేసుకునేవారు. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ జూదం, బెట్టింగ్‌ యాప్‌లను నిషేధించింది. దీంతో జిల్లాలోని జూదరులు మళ్లీ పాత పద్ధతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా పేకాట ప్రారంభించారు.

గ్రూపులుగా.. రహస్య ప్రాంతాల్లో

పేకాట ఆడేందుకు ఐదు మంది నుంచి పదిమంది వరకు గ్రూపుగా ఏర్పడి రహస్య ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా వాంకిడి, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాల, గోలేటి, రెబ్బన, తిర్యాణి, దహెగాం, చింతలమానెపల్లి, సిర్పూర్‌(టి) ప్రాంతాల్లో ఈ దాందా ఎక్కువగా ఉంది. నిర్వాహకులు కొన్నిచోట్ల జూదరుల నుంచి కనిష్టంగా రూ.10 వేల నుంచి మరికొన్ని ప్రాంతాల్లో రూ.25 వేల వరకు డిపాజిట్‌గా తీసుకుంటున్నారు. చెప్పిన మొత్తం చెల్లిస్తేనే ఆడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో పేకాట స్థావరంలో రోజుకు రూ.లక్షల నగదు చేతులు మారుతోంది. జూదరులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో నిర్వాహకులు పంట పొలాలు, మామిడి తోటలు, అటవీ సమీప ప్రాంతాలను స్థావరాలుగా ఎంచుకుంటున్నారు. ఒక్కో ఆట దాదాపు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఇందుకు నిర్వాహకులు ఒక్కో ఆటకు రూ.500 నుంచి రూ.2000 వరకు కమీషన్‌ వసూలు చేస్తున్నారు. మందు, విందు వంటి వసతులు సమకూరుస్తున్నారు. పోలీసుల దాడులు లేకుండా మామూళ్ల ద్వారా మేనేజ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. పేకాడే వారిలో నాయకులతోపాటు సమాజంలో కొంత పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉండటంతో ఫిర్యాదు వస్తేనే దాడులు చేస్తున్నారని, లేదంటే చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని వారు కోరుతున్నారు.

ఇటీవలి ఘటనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement