అడెల్లికి ప్రణమిల్లి..
కొత్తగుడిలో కొలుదీరిన మహాపోచమ్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రాణప్రతిష్ఠ భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
నిర్మల్/సారంగపూర్: తొలిపొద్దు వేళ జిల్లా ప్రజల ఇలవేల్పు.. అడెల్లి మహా పోచమ్మ తల్లి తన కొత్తగుడిలోకి అడుగుపెట్టింది. తనను కొలిచే భక్తులను చల్లంగ చూసేందుకు గద్దైపె కొలువుదీరింది. పచ్చని సహ్యాద్రి సానువుల్లో నుంచి పక్షుల కిలకిలారావాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య శుక్రవారం వేకువజామున మహాపోచమ్మ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. కాశీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పీఠాధిపతి సుదర్శన దండి, తాధిక ప్రతిష్ఠాపనాచా ర్యుడు గురుమంచి చంద్రశేఖరశర్మ, వేదపండితుల బృందం ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ, యంత్రప్రతిష్ఠ, నిత్యనిధి, మహానివేదన, పూ ర్ణాహుతి, కుంభాభిషేకం, సహస్ర కలశాభిషేకం, ప్రథమపూజ, హారతి, తదితర పూజా కార్యక్రమాల ను వేడుకగా నిర్వహించారు. గర్భాలయంలో మహాపోచమ్మతోపాటు తన ఏడుగురు అక్కాచెల్లెళ్లు అయిన బ్రహ్మిణి, మహేశ్వరి, కౌమారి, వైష్టవి, వారాహి, ఇంద్రాణి, చాముండిల విగ్రహాలనూ ప్రతిష్ఠించారు. ఇక ‘చల్లంగ చూడు తల్లీ..’ అంటూ కొత్తగుడిలో, కొత్తరూపులో కొలువుదీరిన తల్లిని కనులారా వీక్షిస్తూ.. మనసారా వేడుకుంటూ భక్తజనం ప్రణమిల్లారు. శుక్రవారం వేకువజామున 3 గంటల నుంచే ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రతిష్ఠాపన పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కాశీ పీఠాధిపతి సుదర్శన దండి భక్తులకు కాసేపు ప్రవచనాలు వినిపించారు. ఈసందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆయనకు అమ్మవారి జ్ఞాపికను అందజేసి ఆశీర్వచనాలు పొందారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు...
అడెల్లి మహాపోచమ్మ అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆయన సతీమ ణి కవిత పట్టువస్త్రాలు సమర్పించారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, మాజీ మంత్రి అల్లోల ఇందక్రకరణ్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, రాష్ట్ర డెయిరీ కా ర్పొరేషన్ మాజీ చైర్మన్ లోకభూమారెడ్డి, తదితర ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి దంపతులు మహా అన్నప్రసాద వితరణ చేశారు.
నూతన ఆలయంలో కొలువుదీరిన పోచమ్మతల్లి
ఉదయం 4గంటలకు అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్న భక్తులు
దారులన్నీ అడెల్లికే..
‘చలో అడెల్లి..’అంటూ దారులన్నీ అమ్మవారి వైపే సాగాయి. నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, నిజామాబాద్ నలువైపుల నుంచి కార్లు, జీపులు, బస్సుల్లో భక్తులు భారీగా తరలివచ్చారు. సారంగపూర్ మండలంలోని ఊళ్లకు ఊళ్లు డప్పుచప్పుళ్లు, డీజేపాటలతో నెత్తిన బోనం కుండలు ఎత్తుకుని అమ్మవారి సన్నిధికి వచ్చాయి. సారంగపూర్ నుంచి అడెల్లి వరకు వందలాది వాహనాలతో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సారంగపూర్‌తోపాటు ప్రత్యేకంగా వచ్చిన పోలీ సు అధికారులు, సిబ్బంది క్లియర్ చేశారు. అడెల్లితోపాటు మండలంలోని పలు గ్రామాల భక్తులు, మాలధారణ చేసిన స్వాములు వేకువజా మునుంచే అమ్మవారి సేవలో భాగమయ్యారు. ఆలయ ఈవో భూమయ్యతోపాటు దేవాదాయశాఖ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది, వైద్యసిబ్బంది తదితర శాఖలన్నీ అమ్మవారి వేడుకలో సేవలందించాయి.
అడెల్లికి ప్రణమిల్లి..


