చెరువుకు చేప..! | - | Sakshi
Sakshi News home page

చెరువుకు చేప..!

Nov 8 2025 7:24 AM | Updated on Nov 8 2025 7:24 AM

చెరువుకు చేప..!

చెరువుకు చేప..!

● ఎట్టకేలకు చేపపిల్లల పంపిణీకి క్లియరెన్స్‌ ● నెలాఖరులోగా పూర్తిస్థాయిలో జలాశయాల్లోకి విడుదల

ఆసిఫాబాద్‌: ఎట్టకేలకు చేపపిల్లల పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఏటా జూన్‌లో నిర్వహించాల్సి న టెండర్లు ఈసారి నాలుగు నెలలు ఆలస్యంగా చేపట్టారు. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి చేప పిల్లల పంపిణీపై ఇటీవల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని కుమురంభీం, వట్టివాగు, ఎన్టీఆర్‌ ప్రాజెక్టులు, మత్తడివాగుతోపాటు 261 చెరువులు ఉన్నాయి. వీటిలో 1.44 కోట్ల చేప పిల్లల విడుదలకు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. గత నెల 27న కాగజ్‌నగర్‌లో చేపపిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం మేరకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం మత్స్యశాఖ, రెవెన్యూ శాఖతో పాటు పశు సంవర్ధక శాఖకు చెందిన ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఒక జిల్లాకు చెందిన కమిటీ మరో జిల్లాలో పరిశీలన చేపట్టనుంది.

మత్స్యకారులకు ఉపాధి

మత్స్యకారులకు ఉపాధి కల్పించి చేయూతనివ్వాలనే ఉద్దేశంలో 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో 74 మత్స్యకారుల సంఘాలు ఉండగా, వీటి పరిధిలో 3,100 మంది మత్సకారులు ఉన్నారు. మత్స్యశాఖ ద్వారా వీరికి చేపల పెంపకానికి అవసరమైన వస్తువులు రాయితీపై అందిస్తున్నారు. అలాగే జలాశయాల్లో పెంచుకునేందుకు వీలుగా ఉచితంగా చేప పిల్లలు అందిస్తున్నారు. కుమురంభీం(అడ), వట్టివాగు, పీపీరావు, ఎన్టీఆర్‌ సాగర్‌ వంటి ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. 11 పెద్ద చెరువులు, 250 చిన్న చెరువులు ఉన్నాయి. ఆయా జలాశయాల్లో ఈ ఏడాది 1.44 కోట్ల చేప పిల్లలు విడుదల చేయనున్నారు. చిన్న చెరువుల్లో 66 లక్షలు, పెద్ద చెరువుల్లో 78 లక్షల చేప పిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగజ్‌నగర్‌లో ఇప్పటికే ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు చేతుల మీదుగా పంపిణీని ప్రారంభించారు.

ఇతర ప్రాంతాలకు ఎగుమతి

జిల్లాలోని జలాశయాల్లో పెంచిన చేపలను స్థానికంగా విక్రయించడంతోపాటు మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. 2022లో 1,35,81,000 చేప పిల్లలు విడుదల చేయగా, 2023లో 1,38,51,000 చేప పిల్లలు, 2024లో 1.45 కోట్ల చేపపిల్లలు విడుదల చేశారు. ఈ ఏడాది 1.44 కోట్ల చేప పిల్లలు వదలనున్నారు. జలాశయాల్లో వదిలిన చేప పిల్లలు 8 నెలల్లో అర కిలోకు పైగా బరువు పెరుగుతాయి. మత్స్యకారులు వాటిని జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్‌, మంచిర్యాల, మహారాష్ట్రలోని చంద్రపూర్‌, బల్లార్షా ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.

నెలాఖరులోగా పూర్తి

ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్ల వివరాలు కమిటీల ద్వారా పరిశీలించి, తక్కువ రేటు వేసిన వారిని ఎంపిక చేశాం. గత నెల 27న కాగజ్‌నగర్‌లో చేపపిల్లల పంపిణీ ప్రారంభించాం. ఈ నెలాఖరులోగా పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తాం.

– సాంబశివరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి

రెండేళ్లుగా జాప్యం..

ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో చేప పిల్లల ను జలాశయాల్లోకి వదలనున్నారు. అయితే గత రెండేళ్లుగా టెండర్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో పంపిణీ ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. ఈ ఏడా ది కూడా జాప్యం జరగడంతో కొన్నిచోట్ల మత్స్యకారులే సొంతంగా చేపపిల్లలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో ఉచిత చేప పిల్లల పంపిణీలో వేగం పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement