మాతాశిశు సంక్షేమానికి కృషి
ఆసిఫాబాద్: మాతాశిశు సంక్షేమం దిశగా కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో శుక్రవారం మహిళాశిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఐసీడీఎస్, వైద్య సిబ్బందికి ఎస్‌ఎస్‌ఎఫ్‌పీఆర్ రీ ఓరియెంటేషన్ నిర్వహించారు. డీఎంహెచ్‌వో సీతారాం, యునిసెఫ్ హైదరాబాద్ బృందం జిల్లా కన్సల్టెంట్ బాలాజీతో కలిసి హాజరయ్యారు. జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ మాతాశిశు, మాతృ పోషణ, ఈవైసీఎఫ్ మార్గదర్శకాలు, పోషకాహార లోప నివారణ చర్యలు, పిల్లల పోషకాభివృద్ధి అంశాలపై సమగ్ర అవగాహన ఉండాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత, వయస్సుకు అనుగుణంగా ఆహారం, సూక్ష్మ పోషకాలు, పిల్లల వృద్ధి పర్యవేక్షణ గురించి నిపుణుల ద్వారా వివరించామని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సాంకేతిక సహాయకులు ప్రవీణ్, నరేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


