‘సర్‌సిల్క్’ స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ఆసిపాబాద్‌అర్బన్: కాగజ్‌నగర్ పట్టణంలోని మూతపడిన సర్‌సిల్క్ మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, కొత్త పరిశ్రమలు స్థాపించాలని సీపీఎం నియోజకవర్గ కన్వీనర్ ఆనంద్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సర్‌సిల్క్ మిల్లు మూతపడి ఉండటంతో సుమారు నాలుగు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. ప్రస్తుతం మిల్లు స్థలాన్ని ఈ– వేలం వేయనున్నట్లు అఫిషియల్ లిక్విడేటర్ ప్రతినిధులు పట్టణంలోని పలుచోట్ల బ్యానర్లు కట్టారని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి నూతన పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం దినకర్, టీకానంద్ తదితరులు పాల్గొన్నారు.


