ఏసీబీ అధికారుల దాడి
ఆసిఫాబాద్‌అర్బన్: రైస్ మిల్లు యజమాని నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటూ పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి ఏసీబీకి చిక్కారు. జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద గురువారం ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు వివరాలు వెల్లడించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ జీవీ నర్సింహారావు దహెగాంకు చెందిన ఓ రైస్‌మిల్లు యజమాని నుంచి సీఎంఆర్ నాణ్యత పరిశీలించి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఒక్కో లారీకి రూ.25 వేల చొప్పున మూడు లారీలకు రూ.75 వేలు డిమాండ్ చేశాడు. అప్పటికే 16 లారీలకు లంచం ఇవ్వడంతో బాధితుడు మంచిర్యాలలోని ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం అధికారి నుంచి డబ్బులు ఇవ్వాలని ఫోన్ వచ్చింది. రెబ్బెన మండలం కై రిగాం ఫ్లైఓవర్ వద్ద కారులో రూ.75 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నర్సింగరావుతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మణికాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల కార్యాలయంలో విచారణ చేపట్టారు. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడినా, లంచం కోసం వేధించినా 1064, ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మొబైల్ నం.91543 88963కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
వేధింపులు భరించలేకనే..
పౌరసరఫరాల శాఖ అధికారుల వేధింపులు భరించలేకనే ఏసీబీని ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు. దహెగాంలోని తన రైస్ మిల్లులో రబీ సీజన్ వడ్లు పట్టకుండా ట్రాక్‌షీట్ ఇవ్వాలని అధికారులు కోరగా నిరాకరించానని పేర్కొన్నాడు. దీంతో అధికారులు కక్ష కట్టి సెప్టెంబర్ 9న బియ్యం సీజ్ చేసి తనపై 6ఏ కేసు పెట్టారని ఆరోపించాడు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు బియ్యం విడుదల చేయలేదని పేర్కొన్నాడు.


