సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పత్తి క్వింటాల్‌కు రూ.8110 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. దళారులు, ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోవద్దన్నారు. జిల్లాలో 24 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. ప్రతీ రైతు కపాస్ కిసాన్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మద్దతు ధర, తేమశాతం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
నిబంధనలు సడలించాలి
పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు సడలించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. తేమ శాతం 12 నుంచి 27 వరకు ఉన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధనను సైతం సడలించి 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, ఏవో మిలింద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు రఫీక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


