సీపీఐ ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సీపీఐ వందో ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని కేఎల్ మహేంద్రభవన్‌లో మంగళవా రం వేడుకలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1925లో సీపీఐ ఆవిర్భవించిందన్నారు. 2024 డిసెంబర్‌లో కాన్పూర్‌లో ప్రారంభమైన వేడుకలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయని తెలిపారు. బ్రిటీష్ పాలన నుంచి దేశానికి విముక్తి కావాలని సీపీఐ రాజీలేని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. నిజాంను గద్దె దించేందుకు తెలంగాణ సాయుధ పోరాటంతో నాలుగున్నర వేల మంది ప్రాణత్యాగాలతో మూడు వేల గ్రామాలకు విముక్తి కల్పించిందన్నారు. పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర పార్టీదని పేర్కొన్నారు. ఖమ్మంలో నిర్వహించే ముగింపు కార్యక్రమాలకు 40 దేశాల కమ్యూనిస్టు పార్టీ నాయకులు, అనేక రాష్ట్రాల నాయకులు హాజరవుతారని తెలిపా రు. జిల్లాలోని సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజా, కార్మిక, కర్షక సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు బద్రి సత్యనారాయణ, లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి సాయికుమార్, జిల్లా సమితి సభ్యులు చిరంజీవి, ఉపేందర్, నర్సయ్య, సీతారాం, మల్లికార్జున్, అంబారావు తదితరులు పాల్గొన్నారు.


