అక్షర ఉల్లాస్‌ం!
వయోజన విద్యకు శ్రీకారం ఇప్పటికే ఐకేపీలకు చేరిన పుస్తకాలు అనేక రంగుల్లో అందంగా ముద్రణ వయోజనులు, వలంటీర్ల గుర్తింపు పూర్తి
కెరమెరి(ఆసిఫాబాద్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యావిధానం–2020లో భాగంగా ‘ఉల్లాస్’ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ఇన్‌ది సొసైటీ) అనే నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాయి. గతంలో ఉన్న సాక్షర భారత్ స్థానంలో ప్రభుత్వం ఉల్లాస్‌ను అమలులోకి తీసుకువచ్చింది. విద్యాశాఖ, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో అక్షరాస్యత సాధించేందుకు శ్రీకారం చుట్టారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల్లోని సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. సెల్ప్ హెల్ప్ గ్రూపుల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నేర్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.
ఓపెన్ స్కూలింగ్ ద్వారా బోధన
కేంద్ర ప్రభుత్వం 2009లో సాక్షర భారత్ అనే కార్యక్రమాన్ని పదేళ్ల కాల పరిమితితో ప్రారంభించగా 2018లోనే ముగిసింది. ఆ తర్వాత 2020లో నూత న విద్యావిధానం అమలులోకి వచ్చింది. దీని ద్వా రా అందరికీ విద్య అందించేందుకు 2022 నుంచి 2027 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం(ఎన్‌ఐఎల్‌పీ)లో భాగంగా డిపార్టుమెంట్ ఆప్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ‘ఉల్లాస్’కు రూపకల్పన చేసింది. ప్రాథమిక, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత కల్పించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమంపై అవగాహన, జీవన నైపుణ్యాలు పెంపొందించి తద్వారా ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ లక్ష్యం. ఈ కార్యాచరణ మే నెలలోనే ప్రారంభమైంది. వివిద దశల్లో ప్రత్యేక వలంటీర్లను నియమించాలని ఆదేశించారు.
వయోజనుల జీవితాల్లో ‘అక్షర’ వికాసం
త్వరలో జిల్లాలో ప్రారంభం కానున్న ఉల్లాస్ కార్యక్రమానికి సంబంధించిన ‘అక్షర వికాసం’ పుస్తకాలు ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో రూపొందించారు. వయోజనులు సులభంగా చదవడం, రాయడం నేర్చుకునేందుకు రంగురంగుల బొమ్మలు, అందమైన అక్షరాలతో ముద్రించిన పుస్తకాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పుస్తకాలు ఇటీవల జిల్లాలోని మండల విద్యావనరుల కేంద్రానికి చేరగా వాటిని ఐకేపీ అధికారులకు అందించారు. సీసీలు గ్రామాల్లో గుర్తించిన నిరక్షరాస్యులకు వాటిని అందిస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో 96,580 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. మొదటి విడతలో 22,500 మందిని ఎంపిక చేయాల్సి ఉండగా 23,123 మందిని గుర్తించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. ఈ నెలలో చివరి వరకు ఉల్లాస్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమ విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. కార్యక్రమ అమలుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించారు. డీఆర్‌డీవో ద్వారా సెల్ప్ హెల్ప్ మహిళల్లో నిరక్షరాస్యులను గుర్తించి వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేశారు. నిరక్షరాస్యులకు రోజుకు రెండు గంటల చొప్పున మొత్తం 200 గంటలు బోధిస్తారు. తరగతుల నిర్వహణకు పాఠశాలలు, ప్రభుత్వ కమ్యూనిటీ భవనాలు, అంగన్‌వాడీ సెంటర్లను గుర్తించి డిజిటల్ కంటేంట్‌తో కంప్యూటర్, టీవీలను సమకూర్చనున్నారు.
అక్షర ఉల్లాస్‌ం!


