అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. శనివారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధికి యూఐడీఎఫ్ పథకం కింద రూ.18.70 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన రోడ్లలో 55 కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ అన్యూటి మోడల్ (హెచ్‌ఏఎం) ఫెస్ 1 కింద తీసుకున్నామని, ఇందులో భాగంగా కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ నుంచి సిర్పూర్(టి)వరకు, సిర్పూర్(టి) నుంచి మాకుడి వరకు, కల్వాడ నుంచి ఒడ్డుగూడ వరకు డబుల్ రోడ్డు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన 36 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. తలోడి నుంచి సల్గుపల్లి వరకు డబుల్ బీటీరోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కాగజ్‌నగర్‌లో 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి రూ.18.50 కోట్లు మంజూరయ్యాయని, టెండర్లు కూడా ఖరారు చేశారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, అసెంబ్లీ కన్వీనర్ వీర భద్రచారి, పట్టణ అధ్యక్షుడు శివ, మాజీ కౌన్సిలర్ శివ, బల్క శ్యాం, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.


