‘తలండి శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలి’
కాగజ్‌నగర్‌టౌన్: దహెగాం మండలంలోని గెర్రె గ్రామానికి చెందిన తలండి శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్ అధ్యక్షతన శనివారం పట్టణంలోని యాదవ సంఘ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణి మృతికి కారణమైన మామ సత్తయ్య, భర్త శేఖర్‌తో పాటు కుటుంబ సభ్యులు కుమార్, కవితపై ఎస్సీ, ఎస్టీ హత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల వ్యవసాయ భూమితో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వినోద, అనిత, కోశాధికారి సాహిన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి చాపిలే సాయికృష్ణ, ప్రజా సంఘాల నాయకులు పర్వత వినోద్, నాగేశ్వర్‌రావు, ఏసుకుమార్, త్రిమూర్తి, జయదేవ్, అబ్రహం, తదితరులు పాల్గొన్నారు.


