అనువైన ప్రదేశంలో కొనుగోలు కేంద్రాలు
దహెగాం/పెంచికల్‌పేట్: రైతులకు అనువైన ప్రదేశంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అడిషనల్ కలెక్టర్ డేవిడ్ సూచించారు. మరికొన్ని రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శనివారం దహెగాం మండల కేంద్రంతో పాటు లగ్గాం, ఒడ్డుగూడ, కుంచవెల్లి, చంద్రపల్లి, కల్వాడ, పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్లూర్‌లో స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 40 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తడవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఏఎస్‌వో సాదిక్, ఆడిట్ అధికారి శ్యాముల్, సీఈవో బక్కయ్య, తదితరులు ఉన్నారు.


