
‘రోడ్డు వేయకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం’
లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని జాముల్‌ధార గ్రామం నుంచి కీమానాయక్ తండా, పంగిడిమాదర గ్రామం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, లేకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని శుక్రవారం మూడు పంచాయతీల ప్రజలు కీమానాయక్ తండా రోడ్డుపై నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మూడు పంచాయతీల పరిధిలో 20కి పైగా అనుబంధ గ్రామాలు ఉన్నాయని తెలిపారు. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు అధ్వానంగా మారిందని, బురదతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామన్నారు. అంబులెన్స్ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.