
రోడ్డు వేయాలని విద్యార్థుల రాస్తారోకో
కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మండలం జీడిచేను నుంచి భట్టుపల్లి వరకు రోడ్డు వేయాలని కాగజ్‌నగర్– దహెగాం ప్రధాన రహదారిపై భట్టుపల్లి వద్ద శుక్రవారం విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ జీడిచేను గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నామన్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. వర్షాకాలంలో నడవలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీవో కోట ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు రోజుల్లో ప్రత్యేక నిధులతో రోడ్డుకు మరమ్మతులు చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకో విరమించారు.